Corona Testing : టెస్టుకు పోతే కరోనా వచ్చుడు ఖాయం..!

ప్రతినిత్యం ఏదో ఒక చోట ప్రభుత్వ అధికారులు, హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడుతోంది. అవి పూర్తిగా కాలకుండా గాలికి అటూ ఇటు కొట్టుకుపోతున్నాయి.

corona testing centers in telangana

Corona testing centers in telangana : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. రికవరీ రేటు పెరిగిందని సర్కారు చెబుతున్నా.. పాజటివ్ కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా సింప్టమ్స్ ఉన్న వారి ట్రీట్మెంట్ కు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

కానీ ప్రతినిత్యం ఏదో ఒక చోట ప్రభుత్వ అధికారులు, హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడుతోంది. ఇతర వ్యాధుల సంగతి ఎలా ఉన్నా.. కరోనా వైరస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెల్త్ సిబ్బంది, పేషెంట్లు వాడిన మాస్కులు, పీపీఈ కిట్ లు, శాంపిల్ సేకరించిన స్వాబ్ లు చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి బయో మెడికల్ వేస్టేజ్ కాల్చి వేసే ప్లాంట్లకు తీసుకెళ్లాలి.

కానీ సాక్షాత్తు రాష్ట్ర రాజధానిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. శాంపిల్ సేకరిస్తున్న కేంద్రాల్లో కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. శాంపిల్ సేకరించిన స్వాబ్ లు బయటపడేస్తున్నారు. స్వాబ్ బాటిల్స్ కూడా ఇష్టారాజ్యంగా పడేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ అర్బన్ హెల్త్ సెంటర్ లో సిబ్బంది మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. స్వాబ్ లు, శాంపిల్ బాటిల్స్ ఇతర మెడికల్ వేస్టేజ్ మొత్తాన్ని హాస్పిటల్ లోనే పడేసి కాల్చేస్తున్నారు. అవి పూర్తిగా కాలకుండా గాలికి అటూ ఇటు కొట్టుకుపోతున్నాయి.

ఇదే హాస్పిటల్ కు కరోనా అనుమానితులకు శాంపిల్ కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి రోజు మూడు వందల మంది వరకు టెస్టుల కోసం వస్తుననారు. టెస్టుల కోసం వచ్చే వారు లైన్ లో ఉండే ప్రాంతంలోనే ఇలా స్వాబ్ లు నిర్లక్ష్యంగా పడేశారు.

వాస్తవానికి మెడికల్ వేస్టేజ్ ను ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే అలా కాల్చేయకూడదు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెత్తను కాల్చేయడానికి కూడా అనుమతి లేదు. కానీ మన్సూరాబాద్ అర్బన్ హెల్త్ సెంటర్లో మాత్రం అధికారులకు ఈ రూల్స్ ఏవీ పట్టడం లేదు. టెస్టుల కోసం వస్తున్న వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

Read Also :