పెళ్లైన కాసేపటికే.. వ్యాన్ బోల్తా.. ఏడుగురు మృతి

మృతుల్లో ఇద్దరు చిన్నారు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్టు స్థానికులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం దగ్గర పెళ్లి బృందానికి చెందిన వ్యాన్ బోల్తా పడి ఏడుగురు చనిపోయారు. ఆలయ ఘాట్ రోడ్డులో ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్టు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్లి కోసం ఓ కుటుంబం మినీ వ్యాన్ లో వెళ్లారు. పెళ్లి పూర్తైన తర్వాత తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆలయంలో పార్కింగ్ ప్లేస్ నుంచి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు రావాలి. ఈ సమయంలో మెట్లపై నుంచి వ్యాన్ జారిపోయినట్టు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో వ్యాన్ లో 17 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వధువు.. స్వస్థలం రాజానగరం మండలం వెలుగుబంద కాగా, వరుడు స్వస్థలం గోకవరం మండలం ఠాకూర్పాలెం.