ఏపీలో ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేస్తే.. ఇక ఆ దేవుడే దిక్కు..!

నిబంధనలు ఉల్లంఘిస్తే మోత మోగించేలా రూల్స్ సవరించారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా జేబుకు భారీగా చిల్లు పడటం ఖాయం.
ట్రాఫిక్ ఫైన్ ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోత మోగించేలా రూల్స్ సవరించారు. ఏ మాత్రం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా జేబుకు భారీగా చిల్లు పడటం ఖాయం.
కొత్త ట్రాఫిక్ ఫైన్ లకు సంబంధించి జీవో కూడా రిలీజ్ చేసింది జగన్ సర్కారు. బైక్ లు, ఆటోలు, క్యాబ్‌ల నుంచి 7 సీటర్ కార్ల వరకూ ఒకే విధంగా ఫైన్లు ఉండనున్నాయి.
ఎవరైనా సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10,000, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండో సారికి రూ. 10 వేల జరిమానా వసూలు చేస్తారు.
రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా ఫస్ట్ టైం దొరికితే రూ. 2 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా కట్టాల్సిందే. పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు, ఓవర్‌లోడ్ కు రూ. 20 వేలు జరిమానా వసూలు చేయాలని నిర్ణయించారు.
ఏ ఉల్లంఘనకు ఎంత ఫైన్..?
- వాహనాల చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే: రూ.750
- సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తే: రూ.750
- అనుమతి లేని వ్యక్తులకు వాహనం ఇస్తే: రూ.5,000
- అర్హత కంటే తక్కువ వయసున్న వారికి వాహనం ఇస్తే: రూ.5,000
- డ్రైవింగ్ లైసెన్స్‌కు అర్హత లేని వారికి వాహనం ఇస్తే: రూ. 10,000
- నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే: రూ.5,000
- వేగంగా బండి నడిపితే: రూ. 1,000
- సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్: రూ. 10,000
- రేసింగ్ మొదటిసారి: రూ. 5,000, రెండో సారి: రూ. 10,000
- రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుంటే మొదటిసారి: రూ. 2,000, రెండో సారి రూ. 5,000
- పర్మిట్ లేని వాహనాలు వాడితే : రూ. 10,000
- ఓవర్ లోడ్ : రూ.20,000 ఆపై టన్నుకు రూ. 2,000 అదనం
- వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా: రూ. 40,000
- అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వంటి ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే : రూ. 10,000
- అనవసరంగా హారన్ మోగిస్తే: మొదటిసారి రూ. 1,000.. రెండోసారి రూ. 2,000
- రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి: రూ. 1,00,000