Top
Batukamma

పోలీసోడి ఓ చిరునవ్వు కథ.. గుండెల్ని కదిలించే ఓ ప్రయత్నం..

పోలీసోడి ఓ చిరునవ్వు కథ.. గుండెల్ని కదిలించే ఓ ప్రయత్నం..
X
Highlights

తిరిగి దక్కిన వేలాది బాల్యాలు, మళ్లీ ఒక్కటైన వందలాది కుటుంబాలు... ఆపరేషన్ ముస్కాన్ లో దాగున్నాయి. మానవత గొప్పగా నవ్వాలి

operation smile: కన్నబిడ్డ తప్పిపోయిన ఇంటిలో పదిక్షణాలు ఊపిరినిలుపుకోలేం కదా. ఆ గుండెకోత ఎలాంటిదో, ఆ తల్లి వణకుతూ చూపించే మిస్సింగ్ ఫొటోపై తడిముద్దే సాక్ష్యం. వెదికిన చోట్లల్లా ప్రాణాల్ని వదిలేసి వచ్చే తండ్రిని ఇంకెలానూ బతికించగలిగేది లేదు. ఇక పసిపిల్లలంటారా... మరో పూటకి ఓ పాచిముద్ద దొరికినా, ప్రమాదంలో పడకున్నా మిరకిల్.

మన కళ్ళను మిరుమిట్లు గొలిపే మార్కెట్లు, డ్రీం డెస్టినేషన్లకు టీజ్ చేసే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మరెన్నో బాగా అలవాటైపోయిన దిగులులేని చోట్లు, కూడళ్లలో మిస్సైపోతున్న జీవితాలెన్నో. అక్కడే కాచుక్కూర్చుని బాల్యాన్ని బానిసత్వంలోకి ఈడ్చుకెల్లే ప్రమాదాలెన్నో. వ్యభిచారం, వెట్టిచాకిరీ, అవయవ వ్యాపారం... కళ్లెదుట ఎవరన్నా పసిదాని బుగ్గ గట్టిగా గిల్లితేనే కోపమొచ్చేస్తుంది, మరలాంటిది ఈ మిస్సింగ్ చిన్నారుల వ్యథలు గుండెకి తగిలితే తిరిగి మామూలు మనుషులు కావడం సాధ్యం కాదు. ఈ భయం ప్రతి క్షణమూ తొలిచేసే తల్లిదండ్రుల క్షోభ ఘజియాబాద్ పోలీసులకి అర్థమైంది.

2014 సెప్టెంబెర్... ఘజియాబాద్ పోలీసులు అంతకుముందెన్నడూ సినిమాల్లోనూ చూడని ఆపరేషన్ కోసం సిద్ధమయ్యారు. కొన్ని రోజులుగా భారీగా నమోదవుతున్న చైల్డ్ మిస్సింగ్ కేసుల ఛేదన దాని లక్ష్యం. అరె, వీరంతా ఏమైపోతున్నారనే ఆందోళన అప్పటి సీనియర్ సూపరింటెండ్ ధర్మెంద్ర సింగ్ ది. బాధితుల ముఖాన మిస్సైనదాన్ని తిరిగితెచ్చివ్వాలన్న తండ్రి వేదన, తపన అతడిది. ఘజియాబాద్ మొత్తం అనేక దళాలతో జల్లెడపట్టి 51 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించారు. వీరంతా వేరే ప్రాంతాల పిల్లలు.

అంటే, ఘజియాబాద్ చిన్నారులు వేరే ప్రాంతాల్లో దొరుకుతారా..? ఇంత పెద్ద దేశంలో ఎక్కడని వెదికి ఆచూకీ కనుగొనేదీ..? అప్పటివరకు అనుసరిస్తోన్న పద్ధతైతే సరిపోదు. అప్పటి డీఎస్పీ రణ్విజయ్ సింగ్ కూడా సంకల్పించాడు. ఘజియాబాద్ పోలీస్ ఓ గొప్ప యత్నం ఆపరేషన్ స్మైల్ ప్రాణం పోసుకుంది. 150 మందికి పైగా పోలీసులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

అంత క్వాలిటీ లేని మిస్సింగ్ కిడ్స్ చిత్రాల్ని హై-రెజోలూషన్ లోకి మార్చడం, వారి వివరాలతోటి పూర్తి బ్రోచర్ తయారీ, అప్పటికి అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ ఫోన్లు సామాజిక మాధ్యమాలు ఉపయోగించారు. వేరే ప్రాంతాలకి వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో వీఢిబాలలుండే స్పాట్లను శోధించారు.

ఎంజీవోలూ, చైల్డ్ లైన్, కార్మిక, స్త్రీ శిశు, ఇతర శాఖల సాయంతో ఒకేసారి 227 మంది పిల్లల్ని కాపాడారు. వందలాదిమంది కన్నవారు, కన్నబిడ్డల నవ్వులు, కన్నీళ్లతో ఘజియాబాద్ పోలీసులు కదిలిపోయారు. తిరిగిఒకటైన కుటుంబాల కృతజ్ఞతలు, దండాలు, ఆశీస్సులు, కౌగిలింతలు, ధన్యవాదాలు ఘజియాబాద్ పోలీసోడిని ఆపరేషన్ స్మైల్-2 కి కదిలేలా చేశాయి.

పోస్కో చట్టం, బాలల హక్కులు ఇతర విషయాలతో పాటు, ఓ చిన్నారి బెదిరిపోకుండా సమాచారం ఇవ్వగలిగేలా పోలీస్ పెర్సన్నల్ వ్యవహరించడం, బాధిత కుటుంబాలకు కౌన్సెల్లింగ్ అందివడం నుంచి మరెన్నో విషయాల్ని ఉనికిలోకి తెచ్చిందీ ఆపరేషన్. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ గా పని మొదలైంది. ప్రతియేటా వేలాదిమంది చిన్నారుల్ని కాపాడుతోంది.

ఈ యేడాది కోవిడ్ వల్ల ఆరో ఫేజ్ ఉంటుందో లేదోనని అనుమానాలు తలెత్తాయి. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని కొన్ని వారాల క్రితమే ఆపరేషన్ ముస్కాన్ నడిపించారు.ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 4806 మంది పిల్లలు రక్షించబడ్డారు. ఈమధ్య మిస్సింగ్ కేసుల వార్తలు మనల్ని కలవరపెడుతున్నాయి. ఇలాంటి ఆపరేషన్లు మరిన్ని అవసరం.

ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం ప్రతి యేటా యాభై వేలకు పైగా పిల్లలు మిస్సౌతున్నారు. అనధికారంగా ఈ సంఖ్య లక్షకు పైగానే ఉంతుందని అంచనా. నాలుగు నెలల్లో ఆచూకీ తెలియకపోతే యాంటీ-హ్యూమంట్రాఫికింగ్ యూనిట్ కి కేస్ వెళుతుంది. కుటుంబం, చుట్టుపక్కల వారి అప్రమత్తత వల్ల చాలావరకు ఈ పరిస్థితి ఉండదు. ముస్కాన్ తో పాటు ఫిర్యాదు అందిన వెంటనే స్పందించే వ్యవస్థా బలోపేతమైతే మిస్సింగ్ వేదనలు మరింత తగ్గుతాయి.

మనకు ఎదురయ్యే చిన్నారుల భద్రత విషయంలో యేమాత్రం సందేహం కల్గినా చైల్డ్ లైన్ 1098కి కాల్ చేయడం మన కనీస బాధ్యత. ఓ వైపు DNA ట్రేసింగ్ తో పిల్లల్ని తల్లిదండ్రుల్ని ఒక్కటి చేసే ఆలోచనతో ముందుకెళ్తుంటే, మరోవైపు కొన్నిచోట్ల అలసత్వం, నిర్లక్ష్యం, పైపై హడావిడి వంటి సమస్యలూ ఉన్నాయి. వాటిని ఎండగత్తాల్సిందే. మిస్సింగ్ కేసుల విషయంలో కొన్నిచోట్ల పోలీస్ తీరులో ఇంకా ఎన్నో లోపాలుండొచ్చు.

కానీ, ముస్కాన్ తో మొదలైన మార్పుని అభినందించాల్సిందే. పోలీసోడి చిరునవ్వు కథని(operation smile) షేర్ చేయాలి. ఎందుకంటే, తిరిగి దక్కిన వేలాది బాల్యాలు, మళ్లీ ఒక్కటైన వందలాది కుటుంబాలు... ఆపరేషన్ ముస్కాన్ లో దాగున్నాయి. మానవత గొప్పగా నవ్వాలి

.. అజయ్ కుమార్ వారాల

Next Story
Share it