Top
Batukamma

పైశాచికంగా మారిన భక్తి.. కూతుళ్లను డంబెల్ తో కొట్టి చంపేసి..!

పైశాచికంగా మారిన భక్తి.. కూతుళ్లను డంబెల్ తో కొట్టి చంపేసి..!
X
Highlights

పురుషోత్తమనాయుడు, పద్మజ.. ఆధ్మాత్మికత పీక్స్ కు వెళ్లడంతోనే ఈ దారుణం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

భక్తి పెచ్చుమీరితే ఎంత దారుణంగా ఉంటుందో.. చూపించే ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే దారుణం జరిగింది. చిత్తూరు జిల్లా మదనపల్లె టీచర్స్ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాలిక దినోత్సవం రోజునే.. ఏకంగా అమ్మానాన్నలే తమ ఇద్దరు కూతుళ్లను పొట్టనపెట్టుకున్నారు.

తమ ఇద్దరు కుమార్తెలు అలేఖ్య (27), సాయి దివ్య (22) డంబెల్స్‌ తో కొట్టి హత్య చేశారు. తల్లి పద్మజ మాస్టర్స్ మైండ్స్ కాలేజీ కరెస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌గా, తండ్రి పురుషోత్తమనాయుడు మదనపల్లె ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్‌ గా పని చేస్తున్నారు. పురుషోత్తమనాయుడు, పద్మజ.. ఆధ్మాత్మికత పీక్స్ కు వెళ్లడంతోనే ఈ దారుణం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

కొద్దిరోజులుగా ఆధ్యాత్మికతలో తీవ్రంగా మునిగిపోయారు. అది కాస్తా మూఢభక్తిగా మారింది. ఇంట్లో అద్భుతాలు జరుగుతాయని కొద్ది రోజులుగా వీరు ఇంట్లో పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న అంటే ఆదివారం రోజున కూడా వీరు ఇంట్లోనే పూజలు చేశారని.. ఈ క్రమంలోనే ఇద్దరు కూతుళ్లను డంబెల్ తో కొట్టి చంపారని స్థానికులు చెబుతున్నారు.

పై అంతస్తులో ఒకరిని, కింది అంతస్తులో చంపేశారు. ఇద్దరికి కూడా చీరకట్టి నోట్లో రాగిచెంబు పెట్టి ఉందన్నారు పోలీసులు. చీర కట్టి, రాగిచెంబు పెట్టాక.. తలపై డంబెల్ తో కొట్టి చంపినట్టుగా గుర్తించామన్నారు.

అయితే.. ఇంట్లోంచి పెద్దపెద్దగా శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన బయటకు వచ్చింది.

అయితే.. తల్లిదండ్రుల ప్రవర్తన చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దర్నీ చంపేసిన తల్లిదండ్రులు.. ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలు వారిని షాక్ కు గురిచేస్తున్నాయి. "ఈ ఒక్క రోజు రాత్రి ఆగండి.. పిల్లలు తిరిగి బతికి వస్తారు.." అని చెబుతున్నారన్నారు.

చనిపోయిన అమ్మాయిలిద్దరు కూడా బాగా చదువుకున్నారు. పెద్దమ్మాయి.. భోపాల్ లో మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చదివిందని, చిన్నమ్మాయి బీబీఏ చదివి.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహహాన్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకుటోందని పోలీసులు చెప్పారు.

Next Story
Share it