Top
Batukamma

SP Balu : ఓ రామయ్య... ఓ శివయ్య... మీ "బాలు"డిని కాపాడరే..!

SP Balu : ఓ రామయ్య... ఓ శివయ్య... మీ బాలుడిని కాపాడరే..!
X
Highlights

SP Balu : “ప్రాణము నీవనీ తెలుసు...గానము నీదనీ తెలుసు....ఆయన గానం మాకు ప్రాణమనీ నీకు తెలుసు....మరెందుకు...

SP Balu : “ప్రాణము నీవనీ తెలుసు...గానము నీదనీ తెలుసు....ఆయన గానం మాకు ప్రాణమనీ నీకు తెలుసు....మరెందుకు సంశయిస్తున్నావు శివయ్యా? అయినా...అమృతాన్ని వదిలేసి గరళాన్ని మింగిన వాడివి, నీకెలా తెలుస్తుందిలే అమృతం గురించి! ఒక్కసారి ఆయన పాట విను...ఆ గొంతు చేసే గమ్మత్తును కను, చెవుల్లో అమృతం పోసినట్లుండదూ?

మేలుకో శ్రీరామా....అంటూ నిన్ను నిదుర లేపాలి, లాలిజో లాలిజో అంటూ మమ్ము నిదురపుచ్చాలి. ఆ పాటలే కదా మా తెలుగోడికి ఊపిరి. మరి ఆ గొంతు నేడు ఊపిరి తీసుకోడానికే కష్టపడుతోందే, ఆ గొంతును రక్షించడం నీ వంతు కాదా రామయ్యా?

అన్నట్టు తెలుగంటే గుర్తుకు వచ్చింది. అర్ధం, భావం క్షుణ్ణంగా తెలుసుకుని, స్వచ్ఛమైన ఉచ్చారణతో శ్రావ్యంగా వినిపించే మా బాలు అంటే భాష కి ప్రతిరూపం కదా! మరి నేడు మా భాషతో పాటు మా బాలుడు కూడా అంపశయ్య మీద ఉన్నారు. కాపాడటం నీ కర్తవ్యం కాదా కృష్ణయ్యా?

అమ్మా సీతమ్మ తల్లీ....నను బ్రోవమని చెప్పవే అంటూ శ్రీరామదాసు అంతటివాడే నీకు మొర పెట్టుకున్నాడు. మేమెంత? మా “అప్పదాసు”(మిథునం చిత్రంలో బాలు గారి పాత్ర) ని మాకు క్షేమంగా అప్పచెప్పమని కోరడంలో తప్పేముంది?

మీమీ లోకాలలో గంధర్వులు ఎలా పాడుతారో తెలీదు...అసలెలా ఉంటారో కూడా తెలీదు. కానీ మరో లోకంలో విహరింపజేసే మా గాన గంధర్వుడి పాట విన్నాక అసలా ఆ అవసరమే లేదనిపిస్తుంది. ముక్కోటి దేవతలారా.... మరి ముక్కుమీద వేలేసుకుని అలా చోద్యం చూస్తున్నట్టు చూస్తారేం? మా గోడు విని మా గంధర్వుని కష్టాన్ని గట్టెక్కించరాదె?

మా షేక్ మోజెస్ మూర్తిని (మల్లెపందిరి చిత్రంలో బాలు గారి పాత్ర) ఆదుకోమన్న సర్వమతాల ప్రార్ధన మీకు వినిపిస్తోంది కదా! తటపటాయించక తరతరాలుగా మమ్మల్ని అలరిస్తున్న మా తెలుగు ముద్దుబిడ్డ తటాలున లేచి కూచునేలా తధాస్తు అనలేరా...!

అభిషేకిస్తే వరాలు కురిపిస్తారే.....స్వరాలకు అభిషేకం చేసే ఆయనను ఆదుకోలేరా? తియ్యగా పాడుతానంటూ ప్రతినిత్యం మా చెవులకు విందు చేసే తనను తిరిగి మామూలు మనిషిని చేయలేరా?

నరుడి బ్రతుకు నటన అని తెలుసు....ఈశ్వరుడి తలపు ఘటన అనీ తెలుసు....అయినా ఆ రెంటి నట్టనడుమ అణువణువునా నాదం నింపిన మా బాలు గురించి మాకుండదా తపన?

అయ్యగారి కృష్ణకుమార్

Next Story
Share it