Top
Batukamma

వ్యవసాయచట్టాలపై.. ఆ పార్టీ ఐటీ సెల్ కు ఓ రైతు బహిరంగ లేఖ..!

a farmer open letter to bjp
X
Highlights

ఏసీ రూముల్లో కూర్చుని ఏమీ తెలియకుండా వ్యవసాయం గురించి మాట్లాడకండి.. మీ నోట్లో మీరే మన్ను పోసుకోకండి

a farmer open letter to ruling party of india : వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తున్న వారు అంబానీ(ambani), అందానీ(adani)లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? ఇతర దేశాల కంపెనీల వస్తువులు వాడుకుంటూ.. అంబానీ, అదానీ, టాటాను విమర్శిస్తున్నారు.. అని పోస్టులు పెడుతున్నారు...

..

అయ్యా.. ప్రభుత్వం(గతంలో కాంగ్రెస్ అయినా.. ఇప్పుడు బీజేపీ అయినా) ఆ రెండు మూడు కంపెనీలకు దోచి పెడుతోంది. రైతుల పొట్టగొడుతోంది. వ్యవసాయాన్ని తీసుకెళ్లి వాళ్ల చేతుల్లో పెట్టేస్తే లాక్కోలేక.. పీక్కోలేక తల్లిడిల్లిపోయేది రైతే. ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే మీలాంటి వాళ్లు కాదు. ఓ సారి ఏసీ రూమును వదిలి పల్లెకు వెళ్లి రైతులను అడగండి.

ఉన్న ఊళ్లోనే పంటను అమ్ముకోవడానికి రైతుల ఎన్ని తిప్పలు పడుతున్నాడో.. పక్కూరుకెళ్లి.. పక్క రాష్ట్రానికెళ్లి అమ్ముకోగలడో..? ఆలోచనా శక్తి ఉంటే ఆలోచించండి. ఇది రైతులు ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోవడానికి కాదు.. కొనేవాడు ఎక్కడికైనా వెళ్లి కొనుక్కోవడానికి తీసుకొచ్చిన ఒక చట్టమని.

సరే.. రైతుల మంచి కోసమే మీరు, మీరు సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వాలు చట్టాలు చేశాయని అనుకుందాం.

అలాంటప్పుడు.. రైతులను ఓ సహకార సంఘంగా ఏర్పాటు చేసి వాళ్లతోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టించి.. వారి పంటలను వారే ప్రాసెసింగ్ చేసి.. అమ్ముకునే వెసులుబాటు కల్పించొచ్చు కదా.!

వారికి సబ్సిడీపై యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం.. వ్యవసాయ సలహాలు, సూచనలు అందిచ్చొచ్చు కదా. అదే జరిగితే రైతు పక్క ఊరికి కాదు ... పక్క దేశానికి కూడా వస్తువును ఎగుమతి చేసే స్థాయికి రైతు ఎదుగుతాడు కదా.! ఇది ఎందుకు చేయరు..?

ప్రైవేటు మార్కెట్ లు ఓపెన్ చేసేస్తే.. వాడు ఇష్టం వచ్చిన ధరకు దోచుకుపోతాడు. అప్పుడు నష్టపోయేది రైతే. ఈ విషయం తెలిసి కూడా మద్దతు ధర అంశాన్ని మీరు చట్టంలో ప్రస్తావించలేదు. రైతుల ఆందోళనతో దిగొచ్చిన మీరు సవరణ చేసేందుకు సిద్ధం అంటున్నారు. అంటే రైతులకు నష్టం జరుగుతుందని తెలిసినా.. మద్దతు ధర అంశం చట్టంలో ప్రస్తావించలేదంటే.. మీరు, మీ ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీ వాడికి అమ్ముడుపోయినట్టే కదా.?

నిజంగా రైతులపై ప్రేమ ఉంటే.. రైతుల మంచి కోసమే చట్టాలు చేసినట్టైతే.. మీ గుండెల మీద చేయి వేసుకుని.. ఆత్మసాక్షిగా చెప్పండి.. "ఇందులో కార్పొరేట్ వాడికి దోచిపెట్టే అంశాలు లేవు.. నూటికి నూరు శాతం రైతుల మంచికోసమేని". మీరు చెప్పలేరు. ఎందుకంటే ఇందులో రైతులకొచ్చే లాభం కంటే.. కార్పొరేట్ వాడికి మరీ ముఖ్యంగా ఆ మూడు నాలుగు కంపెనీలకు జరిగే లాభమే ఎక్కువ.

అందుకే ఇకనైనా సదరు పార్టీల ఐటీ సెల్స్ ను వదిలి.. సో కాల్డ్ డబ్బా కొట్టే మీడియాను పక్కన పెట్టి.. ఓ పల్లెటూరికి వెళ్లి.. ఓ రైతుతో మనిషిగా మాట్లాడి చూడండి. ఓ పార్టీ కార్యకర్తగా.. ఐటీ సెల్ లో పనిచేసి.. ఫేస్ వార్తలు ప్రసారం చేసే వ్యక్తిగా కాకుండా.. ఓ సామాన్య మానవుడిగా అతనితో మాట్లాడి చూడండి.

చట్టం గురించి అందరికంటే మీకు ఎక్కువ తెలుసని చెప్పుకుంటున్నారు కదా. మీకు తెలిసిన అంశాలే ఓ సగటు రైతుకు చెప్పండి(ఓ సామాన్యుడిలాగా మాత్రమే.. పార్టీ కార్యకర్తలా కాదు). అప్పుడు ఆ రైతు చెప్పే సమాధానం వినండి. తిరిగి వచ్చే మీ పార్టీ పెద్దలకు ఆ విషయాన్ని వివరించండి. లేకపోతే భవిష్యత్ లో పిడికెడు మెతుకులు తినాలన్నా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది.

ఇప్పుడు మీ ఓ పార్టీలో ఉన్నారని.. దానికి సపోర్ట్ చేస్తున్నారు కావచ్చు గాక. కానీ ఓ సారి వ్యవస్థ అంతా కార్పొరేట్ వాడి చేతుల్లోకి వెళ్లాక.. రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. నిన్ను ప్రోత్సహించిన నాయకుడు.. వాడి ప్యాకేజీ వాడు తీసుకుని పోతాడు. నీ చేతుల్లో చిప్ప మాత్రమే మిగులుతుంది.

అందుకే ఆలోచించండి... పార్టీల కార్యకర్తల్లా కాదు.. రైతుల్లా ఆలోచించండి.. సామాన్య మానవుడిలా ఆలోచించండి.

ఏసీ రూముల్లో కూర్చుని ఏమీ తెలియకుండా వ్యవసాయం గురించి మాట్లాడకండి.. మీ నోట్లో మీరే మన్ను పోసుకోకండి

.. వ్యవసాయం గురించి కాస్తో కూస్తో తెలిసిన ఓ రైతు

Next Story
Share it