యూపీలో మరో దారుణం : ముగ్గురు దళిత అమ్మాయిలపై యాసిడ్ దాడి

అమ్మాయిలు, మహిళల వైపు కన్నెత్తి చూస్తే ఖతం చేస్తామని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించినా.. ఘోరాలు మాత్రం...
అమ్మాయిలు, మహిళల వైపు కన్నెత్తి చూస్తే ఖతం చేస్తామని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించినా.. ఘోరాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే హత్రాస్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ గొడవ నడుస్తుండగానే మరో దారుణం జరిగింది.
ఉత్తరప్రదేశ్ లో ముగ్గురు అమ్మాయిలపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లా పర్సాపూర్ లో ఈ ఘటన జరిగింది. రాత్రి.. అమ్మాయిలు ఇంటిలో పడుకుని ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది.
రాత్రి ఒంటిగంటన్నర సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి దాడి చేశారని బాధితుల తండ్రి చెప్పారు. దుండగుడు నిచ్చెన సాయంతో గోడదూకి గదిలోకి ప్రవేశించినట్టు చెప్పారు. పిల్లలు అరవడంతో తాను వెళ్లి చూసే సరికి కాలిన గాయాలతో ఉన్నారని.. వెంటనే హాస్పిటల్ కు తరలించామని చెప్పారు.
ముగ్గురిలో పెద్ద అమ్మాయికి ఎక్కువ గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ సీరియస్ అయ్యారు. నేరగాళ్లపై ముందే కఠినచర్యలు తీసుకుంటే ఇలాంటి దారుణాలు జరగవన్నారు. నేరస్తులకు యూపీ సర్కారు అండగా ఉంటోందని వారిని రక్షిస్తోందని ఆరోపించారు.