Onion Prices : రూ. 26 కే కిలో ఉల్లి.. కేంద్రం బంపర్ ఆఫర్..!

దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల్లో తక్కువ ధరకే ఉల్లి ప్రజలకు అందించనుంది.
Centre curbs stock limits to cool onion prices : : దేశంలో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. నెల రోజుల క్రితం వరకు 50 రూపాయల కేజీ ఉన్న ఉల్లి.. ఇప్పుడు సడెన్ గా కేజీ 100 రూపాయలకు చేరిపోయింది. అటు కూరగాయాలు ధరలు పెరిగి, ఉల్లి ధరలు పెరిగి సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు.
అయితే.. ఉల్లి ధర కేజీ 100 రూపాయలు చేరడంతో కేంద్రం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రజలకు తక్కువ ధరలో ఉల్లి (onion prices) అందించే ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే చాలా చర్యలు తీసుకుంది కేంద్రం.
గతంలోనే దేశం నుంచి ఉల్లి ఎగుమతులపై నిషేధం పెట్టింది. ఇప్పుడు దేశంలోని హోల్ సేల్, రిటెయిల్ వ్యాపారులపైనా ఆంక్షలు విధించింది. నిత్యావసర సరుకుల చట్టం అమలులోకి వచ్చాక మొదటిసారి దాన్ని అమలు చేసింది కేంద్రం.
హోల సేల్ వ్యాపారులు 25 టన్నుల కంటే ఎక్కువ నిల్వ చేయొద్దని చెప్పింది. అలాగే.. రిటెయిల్ వ్యాపారులు 2 టన్నుల కంటే ఎక్కువ నిల్వ ఉంచుకోవద్దని ఆదేశించింది. అలా కాకుండా భారీ స్టాక్ దాచి పెట్టి బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ ధరలకు అమ్ముకోవాలని చూస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ ఆంక్షలు ఉంటాయని చెప్పింది.
ప్రజల ఉల్లి కష్టాలు తీర్చేందుకు మరో నిర్ణయం తీసుకుంది కేంద్రం. తమ దగ్గరున్న బఫర్ స్టాక్ నుంచి రాష్ట్రాలకు ఉల్లి (onion prices) విక్రయించాలని నిర్ణయించింది. కేంద్ర నిర్ణయంతో ఉల్లి తీసుకునేందుకు మన రాష్ట్రంతో పాటు.. అస్సాం, ఆంధ్రప్రదేశ్, బిహార్, చండీఘర్, హర్యానా, తమిళనాడు ముందుకొచ్చాయి.
బఫర్ స్టాక్ లో ని 8000 టన్నుల ఉల్లిని రాష్ట్రాలకు ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి ధరను కూడా ప్రకటించింది. నాసిక్ లోని బఫర్ స్టోరేజీ నుంచి రాష్ట్రాలు స్వయంగా ఉల్లి తీసుకెళ్లితే కేజీ రూ.26 నుంచి 28 రూపాయల వరకు ఇస్తామని చెప్పింది. అలా కాకుండా డెలివరీ ఇవ్వాలంటే కేజీ 30 రూపాయలు చెల్లించాలని చెప్పింది.
కేంద్ర బఫర్ స్టోరేజీ నుంచి ఉల్లి వస్తే ఆయా రాష్ట్రాల్లో ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తక్కువ ధరకే ఉల్లి అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
గతేడాదితో పోలిస్తే ఈ సారి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నెల 21న రిటెయిల్ కేజీ ధర 55 రూపాయలుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 22 శాతం అధికం. అయితే.. ఇంత రేట్లు పెరిగినా రైతులకు మాత్రం సరైన ధర అందడం లేదు.
రైతుల దగ్గర నుంచి వ్యాపారులు కేజీ 5 నుంచి 10 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. అది ఇద్దరు ముగ్గురి చేతులు మారి.. వినియోగదారుడికి చేరే సరికి భారీగా పెరిగిపోతోంది. కాస్త స్టాక్ తగ్గిపోగానే ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.
ఒక సమయంలో మార్కెట్ లో 5రూపాయలకు కేజీ పలికిన ఉల్లి.. కొన్ని సార్లు మాత్రం వంద రూపాయలు దాటిపోతోంది. దీంతో వినియోగదారుడికి ఉల్లి కోయకముందే కన్నీరు వస్తోంది. మళ్లీ ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ప్రత్యేక కేంద్రాలు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది.