Top
Batukamma

రైతులు గెలిచారా..? ఓడారా..? తెర వెనుక కథేంటీ..?

రైతులు గెలిచారా..? ఓడారా..? తెర వెనుక కథేంటీ..?
X
Highlights

ఘజీపూర్ దగ్గర (ఉత్తరప్రదేశ్ -ఢిల్లీ సరిహద్దు) జరుగుతున్న పరిణామాలు అందర్నీ ఉత్సాహ పెడుతున్నాయి. రాకేశ్ తికాయత్ అనే జాటు నాయకుడి కళ్లనీళ్లు రైతులను కదిలించాయి.

ఘజీపూర్ దగ్గర (ఉత్తరప్రదేశ్ -ఢిల్లీ సరిహద్దు) జరుగుతున్న పరిణామాలు అందర్నీ ఉత్సాహ పెడుతున్నాయి. రాకేశ్ తికాయత్ అనే జాటు నాయకుడి కళ్లనీళ్లు రైతులను కదిలించాయి. ఈ జాటులు 2013లో ముజఫర్ నగర్ లో ముస్లిముల మీద దాడులు చేసిన వారు. ఎప్పటి నుండో అక్కడ బలంగా పని చేస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ లో జాటు, ముస్లిము రైతులు సమానంగా పనిచేసేవారు. 2013 హింస వారిద్దరి మధ్య అగాధాన్ని సృష్టించింది. బీజేపీ బాగుపడింది.

'ముజఫర్ నగర్ బాకీ హై ...' అనే డాక్యుమెంట్ తీసిన నకుల్ సింగ్ షైనీ ఈ మొత్తం వ్యవహారం గురించి తన అభిప్రాయాన్ని చెబుతున్నాడు. ఆయన చెప్పిన వాటిలో చాలా ఆసక్తికరంగా, ఆశాజనకమైన సంగతులు ఉన్నాయి.

ప్రియమైన మీకందరికీ

నేను గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు చూస్తున్నాను. రాకేశ్ తికాయిత్ చుట్టూ వెల్లివిరుస్తున్న ఉత్సాహం పట్ల ప్రజలకున్న రకరకాల అనుమానాలను, కోపాన్ని చూస్తున్నాను. ఆ కోపం అంతా 2013లో ముజఫర్ నగర్, షామ్లీ జిల్లాల్లో జరిగిన మతోన్మాద హింస విషయంలో భారత్ కిసాన్ యూనియన్ నిర్వహించిన బాధ్యాతారాహిత్య పాత్ర నుండి పుట్టుకొచ్చిందే.

పశ్చిమ ఉత్తరప్రదేశ్ ను ఆ మతోన్మాదం చుట్టుముట్టి ఇప్పటికి ఏడున్నర సంవత్సరాలు అయ్యింది. ఆనాటి నుండి భారతీయ కిసాన్ యూనియన్ చీలిపోయి చీలిపోయి, అనేక గ్రూపులు అయ్యింది. అన్నిటికంటే పెద్దగా చెప్పుకోవాల్సిన చీలిక -బీకేయూ అతిపెద్ద ముస్లిం నాయకుడు గులాం మహమ్మద్ జౌలా అందులో నుండి వెళ్లిపోవటం. అతన్ని చనిపోయిన బాబా తికాయత్ కుడి భుజంగా అనుకొనేవాళ్లు.

2014 ఎన్నికలో జయంత్ చౌదరి, అజిత్ చౌదరి ఓడిపోయాక ఈ ప్రాంతపు పాత కాపులైన జాటులు అనేకమంది కుంగిపోయారు. చాలామంది 'మనం చౌదరీ సాబ్ ని ఎలా ఓడించాము' అని వెక్కెక్కి ఏడ్చారు. 2013 హింసలో పాలుపంచుకొన్న యువకుల విషయంగా చాలామంది (ముఖ్యంగా పాత తరం వాళ్లు) తీవ్రంగా నిరాశ చెందారు. వారి ఏడుపుల మధ్య రహస్యంగా వాళ్లు తరచుగా 'మన యువకులు, వాళ్లు ఏమి తప్పు చేశారో తెలుసుకోవటానికి -ఇప్పటికీ మించిపోయింది లేదు' అని రహస్యంగా అనేవాళ్లు.

ఇలా చెప్పటం అంటే ఈ హింసలో పెద్ద వాళ్లు పాల్గోలేదని పక్క దారి పట్టించటం కాదు. కానీ భారతీయ కిసాన్ యూనియన్, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు ఉవ్వెత్తున ఎగసిన కాలాలను చూసిన వాళ్లు, ఈ మతోన్మాదం ఎంత నిరర్థకరమో అర్ధం చేసుకొన్నారు. వారి బ్రతుకులో ఆ ప్రాంతపు ముస్లిములు ఎలా కలగలిసి, విడదీయలేనట్లు ఉన్నారో వాళ్లు అర్థం చేసుకొన్నారు.

విపిన్ సింగ్ బలియాన్ లాంటి కొంతమంది స్థానిక జాట్ నాయకులు హిందూ ముస్లిముల మధ్య వచ్చిన వైరుధ్యాన్ని రూపుమాపటానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు మెచ్చుకోదగ్గవి అయినా పశ్చిమ ఉత్తర ప్రదేశ్ అప్పుడు ఎంతగా ద్వేష పూరితం అయ్యిందంటే -ఆ ప్రయత్నాలన్నీ సముద్రంలో నీటి చుక్కలలాగా అయిపోయాయి.

దాడులు జరిగిన దాదాపు 5 సంవత్సరాల తరువాత -ఠాకూర్ సింగ్, గులాం మహమ్మద్ జౌలా నాయకత్వంలో హిందూ ముస్లిం ఉమ్మడి పంచాయితీలు జరిగాయి. చివరికి 2019 ఎన్నికలకు కొద్దిగా ముందు రాకేశ్ తికాయత్ నాయకత్వంలో ఒక పెద్ద ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ 10 డిమాండ్స్ తో ఢిల్లీ చేసింది. అందులో హిందువులూ, ముస్లిములు ఇద్దరూ పాల్గొన్నారు. ఇతర యూనియన్ల వారు ఆ ఉద్యమానికి మద్దతునిచ్చారు. ఢిల్లీని వాళ్లు అప్పుడు ఇంకోసారి ముట్టడించారు. అన్నీ కోర్కెలు నెరవేరకుండా సమ్మెను ముగించారు.


చాలామంది తీవ్రంగా నిరాశపడ్డారు. రాకేశ్ తికాయత్ ను బీజేపీ కొనేసిందని చాలామంది భావించారు. ముజఫర్ నగర్, షామ్లీ జిల్లాల్లో 2019 తరువాత భారతీయ కిసాన్ యూనియన్ నాయకత్వంలో అనేక నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆ నిరసన కార్యక్రమాలలో ముస్లిం రైతులు ఉండటం చాలా ఆసక్తికరంగా ఉండింది. వాళ్లు చాలమందికి భారతీయ కిసాన్ యూనియన్ లో పదవులు కూడా ఉన్నాయి. రాకేశ్ తికాయత్ బీకేయూని మళ్లీ పని చేయించటానికి ప్రయత్నిస్తున్నాడనటానికి ఇది ఒక రుజువు. నరేశ్ తికాయత్ ని కావాలని పక్కన పెట్టారు.

2013 మహాపంచాయతీలో, బీజేపీ పూర్తిగా వేదికని ఆక్రమించుకొని ఉన్నపుడు, బీజేపీ నాయకులతో కలిసి కనిపించిన వాడు నరేశ్ తికాయత్. 2013 హింస తరువాత కూడా అతను రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నాడు. గత రెండు మూడూ సంవత్సరాలుగా రాకేశ్ యూనియన్ పగ్గాలు చేతబట్టి, నరేశ్ ను పక్కన పెట్టేశాడు. అతను సహవాసం చేస్తున్న మతోన్మాద రాజకీయాల వలన అలా చేయాల్సి వచ్చింది.

అన్నదమ్ముల మధ్య ఇది సిద్ధాంతపరమైన తగాదానా, వ్యూహాత్మకంగా ఇలా చేస్తున్నారా అనేది వారికే తెలియాలి.

చివరికి వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనకారులు ఢిల్లీ సరిహద్దులు చేరేసరికి, అందరి దృష్టి ఘజిపూర్ సరిహద్దు మీద కూడా పడింది. గతంలో పశ్చిమ ఉత్తర ప్రదేశ్ కున్న రైతు ఉద్యమాల తీవ్రత, ఉత్సాహంతో ఆ ప్రాంతం ఎందుకు నిరసనలో పాలు పంచుకోవటం లేదు?

నిజం చెప్పాలంటే చాలామంది రైతులు ఈ ఉద్యమంలో చేరాలనే ఆసక్తి చూపించారు కానీ, వారికి రాకేశ్ తికాయత్ మీద పెద్ద నమ్మకం లేకుండా పోయింది. చాలామంది అతను బీజేపీ ఏజెంట్ అనీ, ఏ నిమిషంలోనైనా అటు తిరుగుతాడని అనుమానించారు.

కానీ 27 రాత్రి ఘజిపూర్ సరిహద్దులో జరిగిన సంఘటనలు వారి దృష్టికోణాన్ని మార్చేశాయి. ఘజిపూర్ దగ్గర నిరసన జరుపుతున్న రైతులను తొలగించటానికి పెద్ద ఎత్తున పోలీసు దళం వచ్చి చేరింది. ఏడుస్తూ ఒక వీడియో సందేశం ద్వారా రాకేశ్ తికాయత్ చేసిన భావోద్వేగ విజ్నప్తి పశ్చిమ యూపీ రైతులను కదిలించి వేసింది.

అక్కడ మాట్లాడిన చాలా ముఖ్యమైన విషయాలలో ఒకటి -బీజేపీకి మద్దతునిచ్చి తప్పు చేశాననే ఒప్పుకోలు ప్రకటించటం, ఆ మద్దతునిచ్చిన నిర్ణయానికి తానెప్పుడూ పశ్చాత్తాప పడతానని అనటం. ఆ రాత్రే వేలాదిమంది ముజఫర్ నగర్ లోని సిసౌలి గ్రామంలో అతని ఇంటి ముందు గుమికూడారు. వేలాదిమంది పంచాయితీలో పాల్గొన్నారు.

అక్కడ మాట్లాడిన వక్తలలో ముఖ్యుడు గులాం మహమ్మద్ జౌలా. అతను ముక్కు సూటిగా 'నువ్వు చేసిన రెండు అతిపెద్ద తప్పులు -ఒకటి అజిత్ సింగ్ ఓడిపోయేటట్లు చేశావు. (అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్ దళ్ నాయకుడు. ప్రజల్లో పునాది ఉన్న పార్టీ ఇది) రెండు నువ్వు ముస్లిములను చంపావు' అని అన్నాడు.

ఆయన ఆ మాట అన్నప్పుడు ఆసక్తికరంగా ఎలాంటి కేకలు, అరుపులు వినబడలేదు. సూది పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం ఉండింది. ఆత్మ పరిశీలన జరిగింది. మిగతా వక్తలు 'మేము ఇంక ఎప్పుడూ బీజేపీ భ్రమల్లో పడమని' చెప్పారు. బీజేపీని బాయ్ కాట్ చేస్తామనే అరుదైన నిర్ణయం అక్కడి చారిత్రాత్మక పంచాయితీలో జరిగింది. ఒక రాజకీయ పార్టీని బహిరంగంగా తిరస్కరించిన అరుదైన మహా పంచాయితీ అది.

ఈ రోజు కూడా ఘజిపూర్ సరిహద్దు వద్ద రైతులు మద్దతు క్షేత్రస్థాయిలో పెరిగింది. బాఘ్పట్, ముజఫర్ నగర్, షామ్లీ, మీరట్ జిల్లాల నుండి అలాంటి అభిప్రాయాలే ప్రతిధ్వనిస్తున్నాయి. '2013లో జరిగింది ఒక పెద్ద తప్పు' అని. 'మా కోపాన్ని బీజేపీ ఉపయోగించుకొన్నది. దాని ఒరవడిలో మేము కొట్టుకొనిపోయాము' అని. '2013 దాడులకు బీజేపీ, ఎస్పీ పార్టీలు కారణం' అని. మరీ ముఖ్యంగా 'ముజఫర్ నగర్ దాడుల వలన 2013 తరువాత బీజేపీ పశ్చిమ యూపీలో బాగా పెరిగిపోయిందనీ, దాని పతనం కూడా ముజఫర్ నగర్ నుండే జరుగుతుందనీ' అనటం. 1988లో బోట్ క్లబ్ లో ప్రతిధ్వనించిన భారతీయ కిసాన్ యూనియన్ ప్రముఖమైన నినాదాలు 'హరహర మహాదేవ్, అలాహో అక్బర్' మళ్లీ పునర్ ప్రవేశం కావచ్చు.

అయితే ఇది గతాన్ని అంత తొందరగా తుడిచివేస్తుందా? 2013నాటి గాయాలను మాన్పుతుందా?

ఇంతకుముందు 2013 ముజఫర్ నగర్ దాడుల గురించి సినిమా తీసి, వాళ్లకు కలిగిన ఆ బాధనూ, విధ్వంసాన్నీ చూపించిన వాడిగా నా దగ్గర సమాధానం లేదు.

అలా జరగవచ్చు. జరగక పోవచ్చు. ఆ 60000మంది, అందరూ ముస్లిములు, వారి గ్రామాల నుండి వెళ్లగొట్టబడ్డారు. వాళ్లు ఎప్పటికీ వారి స్వంత గ్రామాలకు వెళ్లలేరు. 2013 హింసకు బాధ్యత వహించి, ఇప్పుడు పశ్చాత్తాపం ప్రకటిస్తున్న వారికి క్లీన్ చిట్ ఇవ్వవచ్చా? ఇది న్యాయమైన పరిష్కారమేనా? నాకు తెలియదు.

2013 హింస వలన పశ్చిమ ఉత్తర ప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందనే నాకు తెలుసు. చాలాసార్లు పునరావృతం అయిన ఆ ఘటనల వలన జరిగిన నష్టం తీవ్రమైనది. ఇంకా చాలామంది బాధ పడుతూనే ఉన్నారు. 2013 హింస జరగక పోతే యోగీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. మోడి ప్రధానమంత్రి కూడా అయ్యేవాడు కాదనుకొంటాను.

నాకు తెలిసింది ఒకటే. పశ్చిమ యూపీలో కొంత శాంతి, స్వస్థత చేకూరాలంటే, ఇంకా చాలా కాలం పడుతుంది. ఇప్పుడు పశ్చిమ యూపీలో జరుగుతున్న లాంటి ఘటనలు ఇంకా చాలాకాలం జరగాలి.

హిందూ ముస్లిముల మధ్య వ్యక్తిగత సంబంధాలకు కూడా మళ్లీ సంధి కుదరాలి. ఇలా చెప్పటం అంటే అంతా మారిపోతుందని కాదు. కానీ ఇలాంటి చిన్నచిన్న, పెద్ద అడుగులు మంచి విషయానికి దరి చేరుస్తాయి. చాలామంది రాకేశ్ తికాయత్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారు సరిగ్గానే చేస్తుండవచ్చు. నేను కూడా ఈ పరిస్థితిలో సహనంగా ఉంటున్నట్లే, ఈ విషయంలో కూడా ఓపిగ్గా వేచి ఉండమని కోరుతున్నాను. ఇది చాలా కష్టకాలం. ఇలాంటి పెరుగులాటలు చాలా ముఖ్యమైనవి. బీజేపీ భారతదేశానికి చేసిన నష్టం పూడాలంటే చాలాకాలం పడుతుంది. ఒక్కోసారి కొన్ని వైరుధ్యాలతో కూడా సాగుతుంది. క్షణిక ఆవేశాలు ఎలాంటి సహాయం చేయలేవు.

పశ్చిమ యూపీలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. పంజాబ్ లో క్రియాశీలక రైతు సంఘాలు కొన్ని దశాబ్దాలుగా పనిలో ఉన్నాయి. హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లలో ఈ సంఘాలు రైతులను కదిలించటానికి ఖాఫ్ ల మీద ఆధారపడి ఉన్నాయి. భూస్వామ్య ఆలోచనా ధోరణులను బద్ధలు కొట్టాలంటే కొంత సమయం పడుతుంది. కానీ 29న జరిగిన మహా పంచాయితీ చిన్న అడుగైనా ప్రాముఖ్యమైనది. ఆ అడుగు సమాజాన్ని ప్రజాస్వామికరించేది.

నా స్నేహితుడు అమన్ డీప్ సంధూ చెప్పినట్లు 'ముజఫర్ నగర్ బాకీ హై ...' అని నేను పెట్టిన పేరు నిజంగా ఒక ప్రవచనమే.

Rama Sundari

Next Story
Share it