Top
Batukamma

కొత్త వ్యవసాయచట్టాలతో రైతులకంటే ఎక్కువ నష్టపోయేది మనమే..! ఎలాగంటే..

కొత్త వ్యవసాయచట్టాలతో రైతులకంటే ఎక్కువ నష్టపోయేది మనమే..! ఎలాగంటే..
X
Highlights

ఉపాధిలేక బిచ్చగాళ్లైన మనం మాల్స్ ముందు అడుక్కుని బ్రతికేయొచ్చు.

కేసియార్ చేసిన ఈ ప్రకటన వ్యహాత్మకం కావచ్చుఁ, కాకపోవచ్చుఁ గానీ మొత్తానికి ఒక వాస్తవాన్ని ప్రకటించింది. అది కొత్త వ్యవసాయ చట్టం వల్ల ఇకపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల్లో తొలి అడుగు మాత్రమే. చివరి దినాన ప్రభుత్వం రైతుతో సంబంధం తెంచుకోవడంతో మిగుల్తుంది.

ప్రభుత్వానికీ రైతుకీ మధ్య ఎందుకుండాలి అనేవాళ్లు ప్రభుత్వం రైతులకోసం ఏం చేస్తుందో తెలుసుకోవాలి.

ప్రభుత్వం భూమిలో విత్తడానికి విత్తనాలు సబ్సిడీ ఇస్తుంది, ఎరువుల మీద సబ్సిడీ ఇస్తుంది (ప్రస్తుతం ఒక బస్తా యూరియా మీద 585రూ.). నీళ్ల వాడకానికి ప్రాజెక్టులు నిర్మిస్తుంది, కాలువలు తవ్వుతుంది, బోరు బావులు ఉచితంగా వేస్తోంది. ఆ బావులనుండి నీరు తోడుకోవడానికి కరెంటు ఉచితంగా ఇస్తుంది.

వేసిన పంటకు ఇన్సూరెన్సు ఇస్తుంది. కనీస మద్దతు ధర ఇస్తుంది. పంటను తరళించడానికి రోడ్లు వేస్తుంది, లారీలు, ట్రాక్టర్ల వంటి యంత్రాల కవసరమయ్యే మయ్యే డీసిల్ మీద సబ్సిడీ ఇస్తుంది. గోదాములు గిడ్డంగులు ఏర్పాటు చేస్తుంది. మార్కెట్ యార్డులని నెలకొల్పుతుంది. రైతుకు మద్దతుగా సరుకు అమ్మకం జరిగే యంత్రాంగం నిర్మిస్తుంది.

రైతు పంటలమీద అమ్మకపు పన్నేకాక, ఆదాయపన్నుకూడా లేకుండా చూస్తుంది. టక్కువ వడ్డీకి బ్యాంకుల్లో లోన్లు ఇప్పిస్తుంది, ప్రత్యేక వ్యవసాయ బ్యాంకుల్ని, సహకార సంఘాల్ని నిర్వహిస్తుంది. భూమి రికార్డుల్ని నిర్వహిస్తుంది, భూమిమీద పనిచేసే కౌలు రైతుల్ని సరిచూస్తుంది.


డ్రిప్ వంటి నీటిపారుదలకోసం పైపులు, ఇంజిన్ల మీదా సబ్సిడి ఇస్తుంది. రకరకాల క్రిమికీటకాలమీదా, మందులమీదా, మేలురకపు విత్తనాలమీదా పరిశోధనలు నిర్వహిస్తుంది, వాటికోసం తయారయ్యే విధ్యార్థులకు కళాశాలలు నిర్మిస్తుంది, పరిశోధన తర్వాత వాటిని రైతులకు అందించేందుకు పత్రికలు, రేడియోలూ, ప్రచారాలు నిర్వహిస్తుంది. వాతావరణం చెప్పడం నుండి, ఏ పంటలు వేయాలో అవగాహన, పంటల నిర్వహణకోసం శాటిలైట్లను ప్రయోగించడం దాకా చాలా పనులు నిర్వహిస్తుంది..

కొత్త వ్యవసాయ చట్టాలు అమలవడమంటే ప్రభుత్వం ఈ బాధ్యతలనుండి తప్పుకోవడం అన్నమాట. కేసీయార్ ప్రకట ఈ చర్యల్లో తొలిమెట్టు. ఎందుకంటే ఇవన్నీ నిర్వహించే ప్రభుత్వం తాను రైతుకీ, వినియోగదారునికీ మధ్య తాను నిర్వహిస్తోన్న పాత్రనుండి తప్పుకుని ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన అంబానీ, అదానీలకు అప్పజెబుతుంది. వాళ్లు వ్యవసాయం చేయరు. రైతులతో చేయిస్తారు. కొన్నాళ్ల తర్వాత తిరిగిచూస్తే పొలం పేరుకు మాత్రమే రైతుది, శారీరక కష్టం మాత్రమే రైతుది. మీగతాదంతా కార్పొరేట్ కంపెనీలది.

ఇంత చేసి వ్యవసాయం చేసి పంటలు పండించాల్సిన అవసరంలేదు, బడాకంపెనీలు అన్ని పొలాల్ని ఏకంచేసి అమెరికాలో లాగా దేశం మొత్తంలో వ్యవసాయాన్ని అంబానీ, అదానీ, టాటా, బిర్లా వంటి ఐదారుమంది మాత్రమే చేస్తూ, వారు ఏది పండిస్తే అది తిందామంటే సమస్యలేదు!

సమస్య ఇంకావుంది, ఈ దేశం వ్యవసాయం మీదే కాదు, వ్యవసాయం నుండి వచ్చిన పరిశ్రమలమీదా ఆధారపడివుంది. వ్య్వసాయానికి ఉపయోగించే వాహనాలూ, యంత్ర పరికరాలూ, ఎరువులూ, పురుగుమందులూ మాత్రమే కాదు కంటికి కనపడే ఎన్నో పనులు, ఎంతోమంది, ఎన్నోస్థాయిల్లో చేస్తూంటారని గుర్తించాలి.


ఉదాహరణగా చూస్తే వేరుశేనగ మాత్రమే రైతు పండిస్తాడు. అయితే దాన్ని సమీప పట్టణంలోని డికార్టికేటింగ్ మిల్లుకి తరళించడానికి, అక్కడ మిల్లులో పప్పు తీయడానికి, గ్రేడింగ్ చేయడానికి, అందులో మసాలా పప్పు అయితే ఉత్తరాదికి, మామూలుదైతే దక్షిణాదిలోని వివిధ చోట్లకు చేర్చడానికి, నూనె తయారీకి ఆయిల్ మిల్లుకు చేర్చి ఆయిల్ తయారీకీ, చివరికి మన వీధిచివరి దుకాణం దాకా దాన్ని చేరవేసే రవాణా, ఈ పప్పుని వాడి చాక్లెట్లు తయారీ పెద్ద కంపెనీల నుండి పప్పు చెక్కీలు చేసే పట్టణంలోని చిన్న కుటీర పరిశ్రమల దాకా అనేక కుటుంబాలు, శ్రామికులు ఉపాధిపొంది జీవనోపాధిని సంపాదించుకుంటాయి.

అయితే ఈ కొత్త చట్టాలు అమలైతే ఇప్పటినుండి డైరెక్టుగా కంపెనీ సరుకుని పొలం నుండి ఫ్యాక్టరీకీ, అక్కడే తుది వస్తువుగా యంత్రాల సహాయంతో తయారీగా రూపొంది, డిమాండ్ వుంటే డైరెక్టుగా విదేశాలకు ఎగుమతి చేయడం, లేకపోతే డైరెక్టుగా షాపింగ్ మాల్స్ కి అతడు నిర్ణయించిన ధరకి వస్తుంది. అప్పటికి ఉపాధిలేక బిచ్చగాళ్లైన మనం మాల్స్ ముందు అడుక్కుని బ్రతికేయొచ్చు.

ఏతావాతా ఒకటే విషయం. వ్యవసాయం కార్పొరేట్ చేతుల్లోకి పోవడం. రైతు పేరుతో భూమి వుంటుంది నామ్ కే వాస్తే. దానిమీద ఏం పండించాలి, ఎలా పండించాలి, ఎప్పుడు పండించాలి.. అన్నీ కార్పొరేట్ సంస్థలు ముందే కొన్నేళ్లపాటు వరకు కుదుర్చుకున్న అగ్రిమెంటు ప్రకారం నిర్ణయమవుతుంది. వూర్లో షావుకారు, పట్టణంలో పురుగుమందుల యజమానిని కాదని పండించిన పంటలమ్ముకోలేని దుస్తితిలోని రైతులు, రేపు కోర్టుల చుట్టూ కంపెనీల పెద్దపెద్ద లాయర్లని ఓడించగలరని వూహించలేం.

అప్పుడు ఇది కర్మ భూమికాదు, కార్పొరేట్ భూమి. -

Siddharthi Subhas చంద్రబోస్

- మరో దశాబ్దం ఇలాగే గడిస్తే ఈ దేశం వల్లకాడవుతుంది.!

- జీ హుజూర్... ఇక చాలు.. వదిలేద్దాం..!

Next Story
Share it