Top
Batukamma

స్వేచ్చ రైతుకా? రైతును దోచుకునే కార్పొరేట్ కంపెనీలకా?

స్వేచ్చ రైతుకా? రైతును దోచుకునే కార్పొరేట్ కంపెనీలకా?
X
Highlights

టమాటాల నాణ్యత చూసి వేలంలో దాని ధర మొదలయి పాటను బట్టి ధర నిర్ణయమయేది.

నేనప్పుడు హైస్కూల్లో వున్నాను. అది 1980ల్లో. మా నాన్న కొత్త కొత్త పంటలతో ప్రయోగాలు చేసేవాడు. అలా ఒక అర ఎకరములో టమాటా(tomato) వేశాడు. మా అదృష్టం బావుండి అది విరగ్గాసింది. దానికి తోడు మార్కెట్లో(market) టమాటాలకు గిరాకీ కూడా వుండింది. కిలో రెండురూపాయలు వున్నట్టు గుర్తు. వుదయాన్నే చద్దన్నం తిని పొలానికి కూలీలతో కలిసి వెదురు గంపలని, పాత గోనె పట్టలని తీసుకొని వెళ్ళేవాళ్ళం.

మధ్యాహ్నం మూడు, ముడున్నర సమయంలో బస్సు మావూరి మీదుగా కడప(kadapa) వెళ్ళేది. అప్పటికల్లా టమాటాలను కోసి, వెదురు గంపల్లో నింపి, గంపలపైన గొనెసంచిని కత్తరించి గంపల అంచులకు గోనెపట్టను బిగించి ఈతాకుతో కుట్టి, వాటిని రోడ్డు మీదికి చేర్చాలి. గంప గంపకూ మండి పేరున్న ఒక ట్యాగ్ కడతాము.

అక్కడ ఎవరో ఒకరిని పట్టుకొని బస్సు రాగానే బస్సుపైకి(bus) చేర్చాలి. బస్సు కండక్టరు, డ్రైవర్లకు రోడ్డు మీద గంపలు చూడగానే ఇంజను ఆపేసేవారు. వాటిని పైకి చేర్చేవరకూ తీరుబడిగా బస్సును ఆపి వుంచేవారు.

ఇక్కన్నుంచీ మొదలవుతుంది రైతు చేయాల్సిన పందారం. బస్సులో గంపకు 25 పైసలు మాత్రమే టికెట్ చింపేవాడు. కానీ గంపకు రూపాయి అడిగేవాడు. మాట్లాడేందుకు ఏమీ వుండదు. లేదంటే రేపు బస్సు ఆపకపోవచ్చు. బస్సు కడప పట్టణం నడిబొడ్డుకు వెళ్ళదు.


దగ్గరలోని లక్ష్మీరంగ థియేటర్ దగ్గర గంపల్ని దింపుకోవాలి. బస్సు పైన గంపలను చూడగానే గంపలు దింపే కూలీలు పోటీపడేవారు. పోటీవుంది గదాని రేటేమీ తగ్గదు. వాళ్ళకు కూడా గంపకు రూపాయి ఇవ్వాలి. దింపిన గంపలను మండీకి తీసుకెళ్ళడానికి గుర్రపు బండినో, ఆటోనో మాట్లాడుకోవాలి. ఎక్కడా రైతు మాటకు విలువుండదు.

రైతు వాళ్ళకు ఓ పల్లెటూరి మొద్దులా కనిపిస్తాడు. ఎవరో ఒకరిని కుదుర్చుకొని మండీకి చేరే సరికి సాయంత్రం ఆరో, ఏడో అవుతుంది. మండీలో ఏ షావుకారుకు వేస్తున్నామో అక్కడ వున్న ఖాళీ స్థలంలో మన గంపలన్నీ దించేసి వెళ్ళిపోతాం. అక్కడ గంపలు దించినప్పటి నుండీ మరసటిరోజు వుదయం ఆ గంపలు అమ్ముడుపోయేవరకూ రైతు పాత్ర శూన్యం.

అలా గంపలు దింపేసి నేనూ, నాన్నా బయట ఎక్కడో హోటల్లో భోజనం చేసి, ఏదో లాడ్జిలో రెండు మంచాలను అద్దెకు తీసుకొని పడుకొని పొద్దున్నే మళ్ళీ మండీకి వస్తే అప్పటికి మన గంపలన్నీ అమ్ముడుపోయి, అన్ని లెక్కలూ చూసి మన చేతిలో ఇంత అని నగదు పెట్టేవారు. ఆ పట్టికలో నానా రుసుములూ, టాక్సులూ, మామూళ్ళు అంటూ సవాలక్ష కోతలుండేవి. ఏ గంపను ఎంతకు అమ్మారు అనేది పూర్తిగా వేలం వేసే ఆ మండీదారుడి మీదే వుండేది. గంపలోని టమాటాల నాణ్యత చూసి వేలంలో దాని ధర మొదలయి పాటను బట్టి ధర నిర్ణయమయేది.

వేలం వేసే షేట్ ఒక్కో గంప దగ్గరా ఓ నిమిషం కూడా గడిపే వీలుండదు. గంపంతా మంచి టామాటాలే వున్నాయని చెప్పడానికి మేము కూడా చిన్న టమాటాలు గంప అడుగున వేసి పైన మంచి పెద్ద సైజున్న టామాటాలు పేర్చేవాళ్ళం. అయినా వాళ్ళు లోపలి వరకూ చేయిపెట్టి తీసి నాణ్యత అంచన వేసేవారు. అదేంటి ఇంత తక్కువ రేటు పోయింది అంటే మీరు తెచ్చిన టామాటాలు అసలు నాణ్యతలేనివి అనేవాడు. రైతు చేయగలిగిందేమీ లేదు. చెతిలో ఎంత పెడితే అంతా తీసుకొని వెళ్ళడమే.


మరీ మంచిరేటు వుంటే తప్ప అడుగడుగునా పందారాలు చేసుకుంటూ వెళితే చివరికి రైతుకు కూలీకూడా కొన్నిసార్లు గిట్టుబాటు అవదు. అలాంటప్పుడు టమాటాలను కోయకుండా తోటమీదే వదిలేయాల్సి వచ్చేది.

రైతు తనకు నచ్చినట్లుగా బస్సు కండక్టురుతో గానీ, ఆటోతో గానీ చివరికి గంపలు కిందికి దించే హమాలీతో కూడా బేరం ఆడే పరిస్థితి వుండేది కాదు. ఇప్పుడేమో మన మోదీ రైతుకు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తున్నాం, పండుగ చేసుకోపోండీ అంటున్నాడు. స్వేచ్చ రైతుకా? రైతును దోచుకునే కార్పొరేట్ కంపెనీలకా?

Prasad Charasala ఫేస్ బుక్ వాల్ నుంచి

ట్రెండింగ్ వీడియో


Next Story
Share it