New Farm bills: కొత్త వ్యవసాయచట్టాలతో నష్టమేంటీ..? సింపుల్ గా చెప్పేశారు.

స్విగ్గీ జోమాటోలే పెడుతున్నాయనుకునే మూర్ఖులకేం తెలుసు రైతు కష్టం.
New Farm bills : చట్టం గురించి తెలుసుకోవాలంటె ముందు రెండు ముఖ్యమైన పాయింట్లు చాలు.. ఎవరికి దోహదం చేస్తదో తెలుసుకోవడానికి..
1. రైతుకు నచ్చిన ధర.
2. రైతుకు నచ్చిన చోట.
మొదటిది...
◆రైతు(farmer) నిర్ణయించిన ధరకే కొనాలి అని కొనుగోలుదారులకు ఏమైనా మార్గదర్శకాలున్నాయా..? చట్టం మొత్తం చదివిన వాళ్ళు చెప్పాలి..నాకైతే కనపడలేదు..
◆అలాంటప్పుడు... రైతు నిర్ణయించిన ధరకి మధ్యవర్తులు కానీ దళారులు కానీ కార్పొరేట్ సంస్థలు (corporate company) కానీ కొంటాయా..? ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి చివరికి వాళ్ళు చెప్పిన ధరకే కొనుక్కుని పోతారు.. అంటే అడ్డికి పావుషేరు అన్నమాట..
◆ఒకవేళ రైతు నేను తక్కువ ధరకు అమ్మను అని మొండికేస్తే ఎవరికి నష్టం..? మార్కెట్లో ఎన్ని రోజులు పట్టుకుని ఉంటాడు..?
ఉదాహరణకు: టమాటా(tomato) (దీనిమీద నియంత్రణ ఎత్తేసారు) లాంటి పంట అయితే రోజుది రోజు తెంపి మార్కెట్ కి తీస్కెళ్లాలి.. ఈ రోజు తీసుకెళ్లింది ఈ రోజే అమ్మాలి అదీ దగ్గర్లో ఉన్న మార్కెట్ కే(market) వెళ్ళాలి ఎందుకంటే రేపటికోసం టమాటాలు చేనులో రడీగా ఉంటాయి వాటిని తెంపి తెల్లారి మళ్ళీ మార్కెట్ కి తీసుకెళ్లాలి.. ఒక్కరోజులో అమ్మకపోతే రోడ్డుమీద పారపోసుకుని వట్టిచేతులతో ఇంటిబాట పట్టాలి..
ఇన్ని చిక్కులలో రైతు తనకు నచ్చిన రేటును నిర్ణయించే ధైర్యం చేయగలడా? చేసి అమ్ముకోగలడా..?
◆ఇలాంటి పంటలను పక్క రాష్ట్రానికి కాదు పక్క జిల్లాకు కూడా తీసుకెళ్లలేం అనే విషయాన్ని అలుసుగా తీసుకుని దళారులు రైతు అడిగిన రేటు పెడతారా..? ఇంకా వరిధాన్యం(paddy) అయితే రేటు లేదని కల్లంలో ఉంచితే పుసుక్కున వాన పడితే నీళ్లపాలు కావాల్సిందే..
రెండవది... (వాణిజ్య పంటలే ఉదాహరణగా తీయకుందాం)
◆దేశంలో 90 శాతం పైగా సన్న, చిన్నకారు రైతులే.. మరి వాళ్లకు పక్క రాష్ట్రాలకు పోయి అమ్ముకునే అంత స్థోమత ఉంటదా? ఉంటే పక్క రాష్ట్రాలకి రవాణా చేసే అంత పెద్ద మొత్తంలో పంట పడిస్తారా..?
◆సరే కొంతమంది రైతులు గ్రూపుగా ఏర్పడి వేరే రాష్ట్రానికి అమ్ముకోవడానికి పోయారే అనుకుందాం.. అక్కడి దళారులు తెలివి తక్కువోల్లా..? ఇంత దూరం తెచ్చినోడు మళ్ళీ వెనక్కి తీసుకపోతాడా అని వట్టలు పిసికి వాడు చెప్పిన ధరకి అమ్మితే అమ్ము లేకుంటే పో అంటాడు..
ఉదాహరణకు.. మా స్వీయ అనుభవం..
మేం మిర్చి(mirchi) పంట పండిస్తాం.. వరంగల్ లో రేటు లేదని నాగపూర్ లో రేటు ఎక్కువ అని ఒక ఐదారుగురు రైతులం కలిసి గ్రూపుగా ఏర్పడి ఒక లారిలోడ్ తీసుకుని వెళ్ళాం, నిజానికి అక్కడ రేటు వరంగల్లో కంటే ఎక్కువగానే ఉంది కానీ తీరా అమ్మినాక లెక్కచేస్తే రవాణా ఖర్చుల్లో సగం మీద పడ్డయి.
ఇవీ క్షేత్రస్థాయిలో జరిగేవి....
ఇన్ని గోసలతో పంట పండించి దేశానికి అన్నం పెడుతూ తనేమన్నా బాగుపడుతున్నాడా అంటే అదీ లేదు, ఎరువుల కోసం చేసిన అప్పులకు మిత్తి (వడ్డీ) కట్టుకుంటూ ఇజ్జత్ కాపాడుకుంటున్నాడు..
ఏండ్లకేండ్లుగా ప్రభుత్వాలు, పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం ఆడుతున్న నాటకంలో నిత్యం బందీ అవుతూనే ఉన్నాడు.. మీదికెళ్లి దేశ ద్రోహి అనే ముద్ర వేయించుకుంటున్నాడు..
జై కిసాన్ అనే నినాదానికి రైతు ఎప్పుడో దూరమయ్యాడు😓
(కాన్వెంట్లలో సదువుకుని కార్పొరేట్ నౌకరీ చేసుకుంటా, స్విగ్గీ జామాటో లో ఆర్డర్ పెట్టుకుని తింటూ మాకు అన్నం స్విగ్గీ జోమాటోలే పెడుతున్నాయనుకునే మూర్ఖులకేం తెలుసు రైతు కష్టం).
- Singer sunitha engagement: సిక్రెట్ గా సింగర్ సునీత నిశ్చితార్థం .. త్వరలోనే పెళ్లి!