Top
Batukamma

కపిల్ దేవ్ ఆ రెండు చపాతీలు.. లెజెండ్ నువ్ పది కాలాల పాటు ఉండాలి

కపిల్ దేవ్ ఆ రెండు చపాతీలు.. లెజెండ్ నువ్ పది కాలాల పాటు ఉండాలి
X
Highlights

లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్. జట్టు కోసమే ఆడిన క్రికెటర్. జట్టును ప్రపంచపటంలో నిలబెట్టిన మొనగాడు కూడా ఆయనే.

స్థల, కాల మానాలకు కట్టుబడి పేరొందినవాడు, అతడు, ఆటగాడైనా, పాటగాడైనా, కలల వేటగాడైనా, అసలెవడైనాగానీ, వీరగాధని రాయలేడు.

సామూహిక ప్రాతినిధ్య అంశంలో, వ్యక్తిగత నైపుణ్యం జట్టుకు, జట్టు వెనకాలున్న విశాల జన సమూహానికి అది అంకితమయినప్పుడు, అదీగాక అతడు ఆ జట్టుకు నాయకత్వం వహించినప్పుడు, ఆయా రంగంలో అతని జట్టు అంతకుముందు ఎరుగని అనితర విజయం సాధించినప్పుడు, అతడు వీరగాధని రాసిన లెజెండ్ అవుతాడు.

ఆడడం ద్వారా గాక, చూడడం ద్వారా పరిచయమైన నేటి క్రికెట్ ఆటలో ఒక ఓవర్లో, ఒక షాట్లో ఒక వ్యక్తి గురించి, అతడి ఆట గురించిన అంచనానే కొలమానమైన పరిస్థితిలో, కపిల్ దేవ్ అనే ఒక లెజెండ్ ని పరిచయం చేయాల్సిరావడం ఇబ్బందే.

బ్రాహ్మణ క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధమైన ఈ దేశపు క్రికెట్ లో కపిల్ దేవ్ బ్రాహ్మణుడు కాడు. అయినా జట్టుకు కెప్టెన్ కాగలిగాడంటే ఎన్నిరెట్లు ఎక్కువ నైపుణ్యం చూపివుంటాడో మన ఊహకే వదిలెయ్యాలి. అదీగాక మైదానంలోకన్నా బయటే ఎక్కువ ఆటలు ఆడే గవాస్కర్, రవిశాస్త్రి వంటి ఆటగాళ్ళున్న కాలం అది.

ఈ దేశానికి అతడు మొదటి ఫాస్ట్ బౌలర్. మొదటి నిఖార్సయిన అల్ రౌండర్. మొదటిసారి ప్రపంచ కప్పుని అందించిన కెప్టెన్. అతడు ఎన్నోమార్లు ఒక చేత్తో బ్యాటు, మరొక చేత్తో బంతి తీసుకుని జట్టుని విజయ తీరాలకి చేర్చినోడు. జట్టు ఓడి పోతున్నప్పుడు అతడి బౌలింగ్ స్పెల్ మొదలైతే చాలు టీవీలవద్దకు పరుగుపెట్టేవాళ్ళు ఆశలు మోసులెత్తుకుని. ఎన్నోమార్లు జట్టు వికెట్లు టపటపలాడితే ఈ "హర్యానా హెరికేన్" ఊడ్చి పారేసేది అవతలి జట్టుని.


ఒక టెస్టు మ్యాచులో అదీ విదేశంలో అదేశపు జట్టుమీద, అదీ టెస్టు మ్యాచులో, చివరి వికెట్టుని అటుపక్క నిలబెట్టి వరుసగా నాలుగు సిక్సులు కొట్టి ఫాలో ఆన్ ప్రమాదంనుండి అతడు మాత్రమే కాపాడగలిగాడు. 17 పరుగులకే సగంజట్టు పెవిలియన్ లో కూర్చున్నప్పుడు టెయిల్ ఎండర్స్ ను కాపాడుకొని 175 నాటౌట్ గా నిలబడి ప్రపంచకప్పు వేటలో జట్టుని నిలబెట్టడం అతనికే చెల్లింది.

టెస్టు క్రికెట్లో అతడు ఒకప్పుడు అత్యధిక వికెట్ల సాధకుడిగా నిలిచాడు. కింగ్ రిచర్డ్స్ ని అద్భుతమైన క్యాచ్ తో వెనక్కి పంపిన అతని నాయకత్వంలోని "కపిల్ డెవిల్స్"కి ప్రపంచకప్ చేజిక్కింది తొలిసారి.


అతడు మైదానంలోనే కాదు, మైదానంలో పోరాడడానికి అవసరమైన తిండికోసం కూడా కొట్లాడాడు మెస్సులో. "నేను ఫాస్ట్ బౌలర్ ని, నాకు రెండు చపాతీలు ఎక్కువకావాలి" అని గొడవలు పడేవాడంటే అతని జీవన పోరాటం అర్థంచేసుకోవచ్చు.

అతడి ప్రవర్తనలో ఎన్నడూ డొంక తిరుగుడు లేదు. మైదానంలో ఆట మాత్రమే ఆడాడు. కేవలం జట్టుకోసమే ఆడిన ఈ దేశపు తొలి, చివరి అతడేనంటారు పరిశీలకులు.

కపిల్ దేవ్ కి ఇంగ్లిష్ సరిగా రాదు. "నాకు మాట రాదు, నిజమే, ఆట మాత్రం వచ్చు కదా!" అన్నాడందుకే. లౌక్యం లేని మనిషి. అందుకే 60ఓవర్ల ప్రపంచ కప్పులో 36నాటౌట్ గా నిలిచి తానాడినప్పుడల్లా జట్టుని ఓడించిన గవాస్కర్, ఎన్నడూ జట్టుకోసం ఆడని రవిశాస్త్రి వంటివాళ్ళు, వాళ్లకు అలవాటయిన నోటి ఆటతో ఇప్పటికీ గొప్ప వ్యక్తులుగా నిలిచిపోవడం ఆశ్చర్యంలేదు.


కపిల్ కోసం మాట్లాడే వర్గంలేదు, వారసత్వం లేదు, రాజకీయం తెలియదు. గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయి, "ఓడిపోతామనే నమ్మకంతో మెల్లగా ఆడామని" ప్రకటించిన మనోజ్ ప్రభాకర్ వంటి ఆటగాళ్లు ఎంపీలుగా వెలిగినా, ఇతడు మాత్రం ఒక రెస్టారెంట్, రియల్ ప్రాపర్టీ నిర్వహిస్తూ అనామకంగా ఈ జాతి గుండెల్లో మిగిలిపోయాడు.

బీసీసిఐ కి సమాంతరంగా ఐసీఎల్ ప్రారంభం చేసి, తద్వారా బిసిసిఐ ఐపీఎల్ నిర్వహించేలా చేసి ఎంతోమంది కులమతప్రాంత సంబంధం లేకుండా తమ ప్రతిభా పాటవాల ప్రదర్శనకు అద్భుతమైన వేదిక నిచ్చాడు. జాతికి గొప్ప ప్రతిభని అలా పరిచయం చేశాడు.

కపిల్ దేవ్ దా.. జవాబ్ నహీ!

Siddharthi Subhas Chandrabose

Next Story
Share it