Subscribe

cinema

జూన్ లో షూటింగ్‌లు షురూ..

tollywood movie shooting

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సినీ పెద్దలు మీటింగ్ ముగిసింది. సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ వర్క్ , సినిమా థియేటర్ల రీ ఓపెన్ తదితర అంశాలపై శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు.

దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. జూన్ లో ఇండోర్, రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలని సూచించారు. అలాగే ఔట్ డోర్ షూటింగ్ లకు దశల వారీగా అనుమతి ఇస్తామని అన్నారు. ఇక రాష్ట్రంలో పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల రీ ఓపెన్ పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

సినీ పరిశ్రమ బతకాలని, అదే విధంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సిఎం అన్నారు. తక్కువ మందితో సినిమా షూటింగ్ లను లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వం కూడా ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సిఎం కేసీఆర్ వెల్లడించారు.

ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు.

Also Read : తిరుమలలో లడ్డులు ఇక అగ్వకే!

(Visited 9 times, 1 visits today)