A day with naxalite: నక్సలైట్ తో ఒక రోజు (ఎపిసోడ్-1)

క్సలైట్ ఆజాద్ ఇంటార్వ్యూ అనగానే జర్నలిస్టుల మొఖాలు వెలిగి పోతున్నాయి.
యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్ స్వీయ అనుభవాలు
పొద్దంతా ప్రతాపం చూపి అలిసి పోయాడెమో సూరీడు... పడమర దిక్కు కొండల వెనుక అస్తమించడానికి సిద్ధమయ్యాడు.. పక్షులకు పోటీ పెట్టినట్లు ఆకాశంలో పరుగెడుతున్నాయి..
ఆ రోజు పందొమ్మిది జూన్ రెండు వేల ఒకటవ సంవత్సరం.. సాయంత్రం ఐదు గంటలు..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ 'వార్త' ఆఫీస్.. ఆరోజు ఇవ్వాల్సిన వార్త కథనాలు ఎడిషన్ ఆఫీస్ కు పంపాను..
రేపు రాసే వార్తల గురించి ఆలోచిస్తూ కుర్చిలో కూర్చున్నాను. ఎప్పుడు జొర్రిగిల్లా ముసురుకుని వేధించే జర్నలిజం వృత్తిపైకి వెళ్లాయి నా ఆలోచనలు.
ఒకప్పుడు జర్నలిస్టు అంటే ఎంత గౌరవం ఉండెదో..?
నిజాయితీగా రాసే వార్త ఎంత సంచనం సృష్టించెదో..?
బతుక లేక బడి పంతులయ్యాడు అనేది ఒకప్పటి పాత సామెత..
కానీ.. ఇప్పుడు.. బతుక లేక జర్నలిస్టు అయ్యాడు.. ఇదీ.. కరెక్టు పదం అనిపించింది.
జర్నలిజంలో వచ్చినా.. వస్తున్న మార్పులపై పుస్తకం రాయాలనిపించింది..
ఆ ఆలోచన రావడమే తరువాయి కంపోజ్ చేయడానికి కంప్యూటర్ స్టార్ట్ చేసాను.
కీ బోర్డుపై నా చేతి వేళ్లు నాట్యం చేస్తుంటే.. అక్షరాలు వరుసగా కనిపిస్తున్నాయి.
ంంం
'' జర్నలిస్ట్''
సమాజంలో గౌరవం గల ఉద్యోగం.. వ్యవస్థలోని కుళ్లును వెలికి తీసే ఆయుధం.. అన్యాయాలపై కొరడా ఝుళిపించే పశుపాతాస్త్రం.. చట్టాన్ని చుట్టంగా మార్చుకొని అక్రమంగా ఆస్తులు సంపాదించే దోపీడి దొంగలను.. మోసగాళ్లను ప్రజాకోర్టులో నిలబెట్టే దమ్ము, ధైర్యం ఒక జర్నలిస్ట్ కే సాధ్యం.. ' వెయ్యి తుపాకుకు భయపడను.. కానీ.. ఒక కలం (జర్నలిస్ట్)కు భయపడుతాను..' అన్నాడు ప్రపంచ నియంత హిట్లర్..
ప్రభుత్వం కూడా జర్నలిజాన్ని ఫోర్తు ఎస్టేట్‌గా గుర్తించింది.. ప్రజాస్వామ్యానికి కళ్లులా వ్యవహరిస్తూ.. అవినీతి, అక్రమాలను వెలుగు తీసుకు వస్తాడు జర్నలిస్ట్.. చీకటి కోణాలపై పరిశోధన కథనాలు పాలకుల రాతలు మార్చుతాయి. ప్రభుత్వాలే వణుకుతాయి.. నిజాయితీగా విధులు నిర్వహించే జర్నలిస్టులకు ఉన్న కలం బలం అలాంటిది మరీ.
కానీ.. ఈ సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలపై వార్త కథనాలు రాసే జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత ఏది..? ప్రాణ రక్షణ ఏది..? ఆర్థిక భద్రత ఏది..?
ప్రజాస్వామ్య భారత దేశంలో అన్యాయాలు చేసి.. అక్రమంగా ఆస్థులు సంపాదించి సమాజంలో గౌరవంగా బతుకుతున్నారు పాలకులు.. అధికారులు... వారు తప్పులు చేసి అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నా.. ఎవరు పట్టించుకున్న దాఖాలలు లేవు.
కారణం..?
జర్నలిజం పొలిటికల్ లీడరుల చేతిలో నలిగి పోతుంది. పెట్టుబడి దారుడి బిజినెస్‌కు మీడియా ఆయుధంగా మారింది. నిజాలను నిర్భయంగా వార్తలు రాసే జర్నలిస్ట్ కళ్లుండి చూడలేని.. చెవులుండి వినలేని.. నోరుండి మాట్లాడలేని న్యాయ దేవతలా మారిన పరిస్థితులు.. అవినీతి అధికారుల బాగోతం బహిర్గతం చేస్తే.. పాలకుల కుంభకోణాలు వెలికి తీస్తే అన్నీ సమస్యలే.. అందుకు ఫలితంగా జర్నలిస్టును టార్గెట్ చేస్తున్నారు.
పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తారు.. గూంఢాలతో దాడులు చేయిస్తారు.. రోడ్ ఎక్సిడెంట్ లో జర్నలిస్ట్ ప్రాణాలు తీస్తారు. అప్పటికి వినక పోతే జర్నలిస్టును మర్డర్ చేయిస్తున్నారు పాలకులు.. అవినీతి అధికాయి..
కానీ.. మారుతున్న కాలంలో పత్రికు.. టీవీ చానల్స్ నైతిక మలువలను తుంగలో తొక్కి పొలిటికల్ పార్టీలకు సపోర్టుగా నిుస్తున్నాయి.. పొలిటికల్ పార్టీన్నిటికి స్వంతంగా పత్రికలు.. టీవీ ఛానల్స్ ఉన్నాయి..
ప్రత్యర్థి పొలిటికల్ పార్టీ లీడరు అవినీతిని బహిర్గతం చేయడమే ఆ పత్రికల.. టీవీ చానల్స్ లక్ష్యం..
పొలిటికల్ వార్‌లా.. మీడియా వార్ కొనసాగుతుంది.
పత్రికలు.. మీడియా పేర్లు వేరైనా.. అన్నీ కూడా తమ స్వాలాభం కోసం పని చేస్తున్నాయి.
ప్రభుత్వ అవినీతిపై వార్త కథనాలు ఇచ్చే దమ్ము లేని పత్రికలు.. టీవీ చానల్స్ అనే నిందను మోస్తున్నాయి. యాడ్ లేకుండా టీవీ చానల్ ప్రసారాలు కాలేవు.. పత్రికలు నడువలేవు.. ప్రభుత్వాల దయ దక్షాణ్యంపై ఆధారపడి కొనసాగుతున్న టీవీ చానల్స్, పత్రికల అవినీతి, అక్రమాలపై వార్త కథనాలు ఇచ్చే దమ్ము లేకుండా పోయింది..
పత్రికాలు, టీవీ ఛానల్స్ యజమానుల వ్యాపార దోరణితో జర్నలిజంలో నైతిక విలువలు లేకుండా పోయాయి..
కొన్ని పత్రికాలు.. టీవీ చానల్స్ బ్లాక్ మెయిలింగ్ చేసి అక్రమార్జనే ధ్యేయంగా, వ్యాపార లాభాలే లక్ష్యంగా రాజకీయాలను శాసిస్తూ ప్రభుత్వాల ద్వారా కోట్ల రూపాయలు లాభ పడుతున్నాయి.
ప్రజల ఆలోచనను పక్కదారి పట్టించి, ఇష్టమైన పార్టీలను గెలిపించడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నాయి.
ప్రభుత్వాల ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి టీవీ చానల్స్.. పత్రికలు..
భారత దేశంలో ఎక్కడ చూసినా.. పత్రికలు,`టీవీ చానల్స్ అధిపతుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది.
పొలిటికల్ లాభం కోసం నెల కొల్పిన టీవీ చానల్స్.. దిన పత్రికలతో జర్నలిజంలో నైతిక విలువలు పతనమైనవి.
పత్రికాలలో ప్రచురితమయ్యే వార్త కథనాలలో నైతిక విలువలే నిజాయితీ కనపించడం లేదు.
ఒకప్పుడు పత్రికలు.. న్యూస్ టీవీ చానల్స్ పై ప్రజలకు ఎంతో గౌరవం ఉండేది. నీతికి, నిజాయితీకి మారుపేరుగా నిలుస్తాయని ప్రజలు భావించేవారు..
ఇప్పుడు పత్రికలలో.. న్యూస్ చానల్స్‌లో వచ్చే వార్త కథనాలపై ప్రజలకు విశ్వాషం లేకుండా పోయింది.
నాడు తెల్లదొర (బ్రిటిష్ పాలకుల) దోపిడీపై పోరాటం చేశారు జర్నలిస్టులు.
దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన ఉద్యమాలలో కీక పాత్ర పోషించాయి పత్రికలు..
నేడు అవినీతి పరులకు.. స్మగ్లరులకు.. రాజకీయ పార్టీలకు తొత్తుగా మారినవి పత్రికలు.. టీవీ ఛానల్స్...'' అప్పటి వరకు కంపోజ్ చేసిన మ్యాటర్‌ను మరోసారి చదువుతున్నాను.
ఆ సమయంలో..
'' అన్నా.. నమస్తే.. '' ఆఫీస్‌లోనికి వస్తూ చిరునవ్వుతో పలుకరించాడు అపరిచిత యువకుడు.
అతనిని నేను ఎప్పుడు చూసిన సందర్భం లేదు..
'' నమస్తే.. కూర్చో.. '' అన్నాను కంప్యూటర్ ముందు నుంచి లేసి అతని ముందు కుర్చిలో కూర్చుంటూ..
''అన్నా ఇంటర్వ్యూ ఉంది.. నక్సలైట్ ఆజాద్ అన్న విలేకరులను తీసుకరమ్మన్నాడు..'' సూటిగా చెప్పాడు ఆ యువకుడు..
'' ఔనా.. సరే వస్తా.. '' క్షణం కూడా ఆలోచించకుండా అన్నాను..
'' కానీ.. ఆర్మూర్ విలేకరుందరికి నీవే సమాచారం ఇవ్వన్నా.. పోలీసులకు అనుకులంగా ఉండే విలేకరులకు చెప్పకు. కొన్ని సామానులు తీసుకోవాలి.. ఇప్పుడే షాపుకు వెళ్లోస్తా..'' చెప్పేసి ఆ యువకుడు వెళ్లి పోయాడు.
' నక్సలైట్ ఆజాద్ ' ఆ పేరు గుర్తుకు రాగానే నా బుర్రలో ఆలోచనలు గిర్రున తిరిగాయి..
ఉత్తర తెంగాణ ప్రాంతంలో పోటీ ప్రభుత్వం నడుపుతున్న కీలకమైన నక్సలైట్ నేత ఆజాద్..
పోలీసులను ముప్పు తిప్పు పెడుతూ నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ప్రజలను సాయుధ పోరాటం చేయడానికి సంఘటితం చేస్తున్నాడు అతను..
అతనిని పట్టుకోవడానికి అడవంతా జల్లెడ పడుతున్నాయి గ్రైహాండ్స్ దళాలు.. స్పెషల్ పోలీసు బలగాలు.. గెరిల్లా పోరాటంలో సుశిక్షుతుడైన ఆజాద్ తలకు ప్రభుత్వం ప్రకటించిన రివార్డు అక్షరాల ఇరువై లక్షలు..
అతని అచూకి పోలీసులకు చెప్పినా.. ప్రాణాలతో పట్టిచ్చినా.. హత్య చేసినా ప్రభుత్వం ఇచ్చే రివార్డు అది..
వారం రోజుల ముందే నక్సలైట్ ఆజాద్ నేతృత్వంలో కరీంనగర్- నిజామాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాలలో పదకొండుగురు కోవర్టులకు మరణ శిక్ష విధించారు నక్సల్స్.. ఆమాయకులను నక్సల్స్ కాల్చీ చంపారని పోలీసులు నక్సల్స్ కోసం అడవంతా గాలిస్తున్నారు. ఉత్తర తెలంగాణ పోలీసుల దృష్టంతా ఆజాద్ పైనే ఉంది.. అతని కోసం రాత్రింబగళ్లు గాలిస్తున్నారు. నక్సలైట్ అగ్రనేత ఆజాద్‌ను ఇంటర్య్వూ చేస్తే పోలీసులతో ఎన్ని సమస్యలో ఒక్కక్షణం ఆలోచించాను.
'' నేను జర్నలిస్టును.. ఎవరినైనా.. ఎక్కడైనా ఇంటార్వ్యూ చేసి సమాజానికి సమాచారం తెలియ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది.. జర్నలిస్టుగా ఉద్యోగ ధర్మం.. '' నాకు నేనే సర్ది చెప్పుకున్నాను.
ప్రజాస్వామ్య భారత దేశంలో ప్రెస్ ఫోర్త్ ఎస్టెట్..
అన్యాయం జరిగితే వార్తలుగా రాసి ప్రజల ముందు పెట్టాల్సిన నైతిక బాధ్యత ప్రతి జర్నలిస్టుపై ఉంది.
కానీ.. జర్నలిస్ట్ జీవితం..
చినిగిన బనీన్ వేసుకుని అది కనిపించకుండా ఇస్త్రీ చేసిన షెర్టు వేసుకున్నట్లు అతని ఆర్థిక పరిస్థితి ఉంటుంది..
గ్రామీణ ప్రాంతాల జర్నలిస్టుల బతుకులు మరీ అధ్వానం..
గ్రామీణ ప్రాంతాలలో పని చేసే విలేకరులకు వేతనలను ఇవ్వకుండా వెట్టి శాకిరీ చేయించుకునే పత్రికా, టీవీ చానల్్ యజమానులు ఉన్నారు.. కుటుంబాన్ని పోషించడానికి అడుగడుగున ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జర్నలిస్టులు..
సమాజంలో టైమ్ బియింగ్ రెస్పెక్ట్ కు బానిసవుతున్నారు జర్నలిస్టులు..
జర్నలిస్టుగా వీఐపీలతో పరిచయాలు.. తాను కూడా వీఐపీని అనే ఫీలింగ్.. ఇలా ఫీలైన చాలా మంది జర్నలిస్టుల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ బతుకుతున్నారు.. .
రెండు.. మూడేళ్లు జర్నలిజం వృత్తిలో కొనసాగిన జర్నలిస్టు ఆ ఉద్యోగాన్ని వదుల లేక ఆవస్థలు పడుతాడు.
ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా.. అన్యాయాలను.. అక్రమాలను వార్త కథనాలుగా రాసి ప్రజల ముందు పెడుతున్నామనే తృప్తితో బతుకుతారు మెజార్టీ జర్నలిస్టులు..
నక్సల్స్ ఇలాకలో పని చేసే గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల బతుకులు మరీ దారుణం.. అవినీతి పోలీసు అధికారుల వార్త కథనాలు రాస్తే.. నక్సలైట్ ముద్ర వేసి వేధిస్తుంటారు.. నిజానికి నక్సల్స్ ఇలాకలో విధులు నిర్వహించే జర్నలిస్టుల బతుకులు పోక చెక్కలో వక్కలా మారినవి.
నక్సల్స్ అని ఒకరు.. పోలీసు ఇన్‌పార్మర్ అని మరొకరు ఇద్దరు ఇష్టమైన బిరుదులిచ్చి జర్నలిస్టును టార్గెట్ చేసేవారే..
కానీ.. నిజాయితిగా పని చేసే ఒక జర్నలిస్టు కలం చాఃలు..
అవినీతితో.. అక్రమాతతో.. ప్రజావ్యతిరేక విధానాతతో పని చేసే ఈ ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి..
అందుకే జర్నలిస్టుకు లేని గౌరవం ఇస్తున్నట్లు నటిస్తుంటారు పొలిటికల్ లీడరులు..
ఇలా ఎడతెరిపి లేకుండా వస్తున్న ఆలోచనలను బవంతంగా పక్కకు పెట్టాను.
ఆ వెంటనే 'వార్త' బ్యూరో ఇన్చార్జీ విపిఎస్ రాజు సార్ కు నక్సలైట్ ఆజాద్ ఇంటర్వ్యూ సమాచారం ఇచ్చాను. ముఖ్యమైన వార్త సేకరణకు వెళ్లాలంటే బాస్‌కు సమాచారం ఇవ్వడం తప్పని సరి..
'' నేను ఇప్పుడే నిజామాబాద్ నుంచి బయలు దేరుతున్నాను.. ఫోటోలు తీయడానికి కెమెరా.. ఇంటర్య్వూ రికార్డు చేయడానికి చిన్న టేపు రికార్డర్ సిద్ధం చేయు.. '' ఆదేశించారు బ్యూరో ఇన్చార్జీ రాజు..
ఆ తరువాత '' అర్జెంట్‌గా మా ఆఫీస్‌కు రండి.. ఇంపర్టెంట్ న్యూస్ చెబుతాను. '' ఆర్మూర్ విలేకరులకు సమాచారం ఇచ్చాను. విజయప్రతాప్ (ఆంధ్రభూమి), సాతెపూతే శ్రీనివాస్ (ప్రజాశక్తి), పోల మధుకర్ (కబురు), మేకల నరేంధర్ (ఆంధ్రప్రభ), క్రిష్ణ (సిటికెబుల్) వారంతా మా ఆఫీస్‌కు చేరుకున్నారు.
'' మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న నక్సలైట్లను ఇంటార్వ్యూ చేసే అవకాశం వచ్చింది.. కానీ.. మీరు నక్సల్స్ ఇంటార్వ్యూ విషయం గోప్యంగా ఉంచాలి.. లేదంటే పోలీసులతో సమస్యలు వస్తాయి.. ఇక్కడికి రాని విలేకరుకులకు పొరపాటున కూడా సమాచారం ఇవ్వద్దు. '' అన్నాను. నక్సల్స్ కార్యకలపాలను వార్తలుగా రాసిన అనుభవం నాకు ఉంది.. నక్సల్స్ సిద్ధాంతాలు తెలుసు.. వారి లక్ష్యం తెలుసు.. వారిని చాలా సార్లు కలిసిన సందర్భలున్నాయి.
కానీ.. ఆ నక్సలైట్లను ప్రత్యక్షంగా చూసే సందర్భం ఆర్మూర్ విలేకరులకు రాలేదు.. నక్సలైట్ ఆజాద్ ఇంటార్వ్యూ అనగానే జర్నలిస్టుల మొఖాలు వెలిగి పోతున్నాయి.. నక్సల్స్‌ను ప్రత్యక్షంగా చూడబోతున్నామనే సంతోషంతో ఉన్నారు వారంతా..
నక్సల్స్ గురించి పరస్పరం చర్చిస్తుండగానే అరగంటలో విపీఎస్ రాజు సార్ ఆర్టీసి బస్సులో వచ్చాడు.. అప్పటికే సిద్దంగా ఉన్న జీపులో కూర్చోగానే కరీంనగర్ జిల్లా మెట్పల్లి వైపు పరుగు తీసింది. నక్సలైట్ నేత ఆజాద్ ఇంటర్వ్యూకు వెళుతున్నామనే విషయం మినహా ఎక్కడికి వెళ్లాలో మాలో ఎవరికి తెలియదు.. ఇంటార్వ్యూ ఎప్పుడు పూర్తయితాదో.. తిరిగి ఎప్పుడు వస్తామో కూడా తెలియదు..
(సశేషం)