టీఆర్ఎస్ నేతలకు చుక్కలు చూపిస్తున్న జనం!

వరద సహాయక చర్యలను పరిశీలించేందుకు వెళ్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జనం చుక్కలు చూపిస్తున్నారు.
హైదరాబాద్‌లో వరద సహాయక చర్యలను పరిశీలించేందుకు వెళ్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జనం చుక్కలు చూపిస్తున్నారు. పర్యటనల పేరుతో కాలనీల్లోకి వస్తున్న ఎమ్మెల్యేలు... తమ వైపు కన్నెత్తి చూడకుండానే తిరిగి వెళ్లడంపై ఫైర్ అవుతున్నారు.
సమస్యలు వినే ఉద్దేశ్యం లేనప్పుడు ఎందుకు వస్తున్నారంటూ మొహం మీదే అడిగేస్తున్నారు. అంతా మునిగాక ఏం చేద్దామని వస్తున్నారంటూ మరికొందరు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలకే కాదు ఏకంగా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డికి కూడా ఈ చేదు అనుభవాలు తప్పలేదు.
ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై జనం నిప్పులు కక్కారు. రామాంతపూర్ పెద్దచెరువు ప్రాంతంలోని రవీంద్రనగర్‌లో బోటులో ముంపు ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన సుభాష్ రెడ్డి.
సమస్యలు తెలుసుకోకుండానే వెళ్తుండటంపై స్థానికులు నిలదీశారు. మూడు రోజులుగా నీళ్లలో మునిగిపోతే.. ఇప్పుడా వచ్చేది అంటూ ప్రశ్నించారు. అయితే వారిని సమాధానపరచాల్సిన ఎమ్మెల్యే... చెరువులో ఇళ్లు ఎవరు కట్టుకోమన్నారు అంటూ వారిని మరింత రెచ్చగొట్టారు. దీంతో వారికి మరింత మండిపోయింది. అసలు మీరెందుకు అనుమతులు ఇచ్చారు అంటూ ఎమ్మెల్యేకు ఎదురు ప్రశ్నవేశారు. దీంతో తెల్లబోయిన ఎమ్మెల్యే మెల్లగా జారుకున్నారు.
ఇక బైరామల్‌గూడలోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ని కూడా స్థానికులు నిలదీశారు. సర్కార్ సహాయక చర్యలపై ఆయన ఎదురుగానే తమ అసంతృప్తి వెళ్లగక్కారు. పోలీసులు అడ్డుకోగా.. కేటీఆర్ కు వినబడేలా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే పోలీసులు కొందరిని కొట్టి మంత్రి వెళ్లేందుకు దారి కల్పించారు. దీంతో బైరామల్‌గూడ వాసులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శించేందకు వచ్చారా.. తమని పోలీసులతో కొట్టించేందుకు వచ్చారా అంటూ కేటీఆర్‌పై మండిపడ్డారు.
ఇక మంత్రి సబితా రెడ్డిని అయితే ఎకంగా కార్పొరేటర్లే అడ్డుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్‌గూల్ పర్టనకు వచ్చిన ఆమెను జనం ముందే నిలదీశారు. రెండు, మూడు రోజులు కష్టపడి తాము స్థానికులకు సాయం చేశామని.. అంతా అయ్యాక మీరేందుకు వచ్చారని ప్రశ్నించారు. అసలు కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేం లేక మంత్రి వెనుదిరిగారు. ఇందుకు సంబంధించి దృశ్యాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.