Top
Batukamma

హైదరాబాద్ వరదలను ప్రశ్నించే హక్కు మనకుందా..?

హైదరాబాద్ వరదలను  ప్రశ్నించే హక్కు మనకుందా..?
X
Highlights

రాత్రంతా పనిచేయాల్సింది మరల మనలాంటి సామాన్య పనివాళ్లే, వాళ్లదీ ప్రాణమే. మ్యాన్ హోల్స్ లోకి దిగాలి,

సాధారణంగా సమస్య బహుముఖం. "ఇక్కడ రాత్రంతా భూమికంపించింది, ఇంట్లో కార్తీకదీపం సీరియల్ చూడలేకపోయాం, అధికారులు తొంగిచూడలేదు" అంటూ మొన్న నిలదీసిన నగర పౌరురాలితో, "38గంటల నుండి కరెంటులేకపోతే అధికారులు నిద్రపోతున్నారా?" అని ఈ రోజు నిలదీసే పౌరుడి ప్రశ్నలో ఆవేశం అర్థంచేసుకోగలం!

కార్తీకదీపం సీరియల్ చూస్తూ భూకంపానికి ఇల్లుకూలి చనిపోవడానికి సిద్దపడిన పౌరురాలు, అధికారులు వచ్చినా భూకంపం ఆపలేరని అర్థంచేసుకోవాలి. అలాగే విద్యుత్ ఆన్ చేస్తే వర్షంలో, వరదల్లో విద్యుత్ షాక్ కారణంగా చనిపోయేవాళ్ల సంఖ్య వేలల్లో లెక్కవేయాలి.

రాత్రంతా పనిచేయాల్సింది మరల మనలాంటి సామాన్య పనివాళ్లే, వాళ్లదీ ప్రాణమే. మ్యాన్ హోల్స్ లోకి దిగాలి, విద్యుత్ స్థంబాలు ఎక్కాలి, అడ్డంపడిన వాహనాలు, చెట్లు తొలగించాలి...

తోసుకుని బస్సెక్కి సీటుపట్టుకున్నప్పుడో, అడ్డులేకుండా రాంగ్ రూట్లో వెహికల్ దూసుకుంటూ పోయినప్పుడో మనకు పోలీసు కనపడనే కూడదనుకుంటాం, బస్సులో తలుపువద్ద చివరిగా నిలబడినప్పుడో, ట్రాఫిక్ జామై వెహికల్ ఆగినప్పుడు మాత్రం పోలీసోడి ఉద్యోగాన్ని ప్రశ్నించే పద్దతిలేని బ్రతుకులు మనవి.

సమస్యలో ఎవరిది తప్పు అనేది లెక్కతేల్చితే చాలాదూరం పోవాలి. ఇదే మామూలు సమయంలో చెరువులో ఇల్లుకట్టుకోరాదని అధికారివస్తే, లంచం ఇచ్చి పని జరిపించుకుంటాం, రిజిస్ట్రేషన్ సమయంలో ఎన్నడైనా ఒరిగినల్ ధరకి స్టాంప్ పేపర్లు కొన్నామా? సిబ్బంది లంచం తీసుకోకుంటే మనకు మాత్రమే కాదు, పై అధికారికి, ఆపై రాజకీయనాయకుడీకీ, పైన ఇంకా పెద్దలకి అతడు శత్రువైపోతాడు. మరుసటిరోజు బదిలీలో వుంటాడు. లేదా నరకం చూస్తాడు.

సగటున ఒక చిన్నపట్టణం ఒక్కరోజుకి ఆరు లారీల చెత్తని రీసైక్లింగ్ నిమిత్తం డబ్బులిచ్చి సేకరించి వ్యాపారం చేస్తోంటే, దానికి రెంట్టింపు పనికిరాని చెత్తని మునిసిపాలిటీ వూరిబయట పారబోస్తోంది, అందులో సగం కుక్కలు, పందులు తినగా అందులో మిగతా సగం డ్రెయినేజీల్లో చేరి నిల్వ వుండి, వాన కురిసినప్పుడు వూరిబయటికి కొట్టుకుపోతోంది.

ఒకప్పుడు వస్తువు పాడైతే దాన్ని రిపేర్ చేయించేవాళ్లం, ఇప్పుడు ఎంతమంది చేయించకుండా, పారేసి కొత్తది కొంటున్నామో తెలుసా? ఒక్కరోజున సగటు వస్తువులు నగరంలోకి, తర్వాత మన జీవితంలోకి డంప్ అవుతున్నాయో తెలుసా? కనీసం కడుపులోకి ఎంతతిండిపోతోందో తెలుసా?

నీళ్ళు ఒక్కరోజులో వెళ్లిపోవడానికి హైదరాబాదు నగరం నదిఒడ్డున కట్టుకున్న ఇళ్లు కాదు. దాదాపు 200 చెరువుల్ని మింగి ఇళ్లు కట్టుకున్నాం, అవి ఎక్కడికీ అంతతొందరగా పోవు. స్వయంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నదిఒడ్డున వుండే కరకట్టలోపలే కట్టుకున్న ఇంటిలోపల కాపురముండి, ఖాళీచేయమంటే ఆందోళన చేసే స్తితి మనది. దయచేసి మనతప్పిదాన్ని ముందుమాట్లాడుకుని తర్వాత ఇతరుల గురించి మాట్లాడుకుందాం.

- సిద్దార్థి సుభాష్ చంద్రబోస్


Next Story
Share it