Top
Batukamma

హైదరాబాద్ ఆగమాగం.. ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్నాథం..!

హైదరాబాద్ ఆగమాగం.. ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్నాథం..!
X
Highlights

ఈ విషయం వర్షాలు, వరదలకు తెలియదు కదా.. అందుకే పేదల గడపే కాదు.. వారి ఇళ్లను ప్రాణాలను ముంచేస్తున్నాయి.

రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. పంట చేతికొచ్చే సమయంలో పడుతున్న వానలతో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోయాయి. జనం అరిగోస పడుతున్నారు.

ఇటు.. అన్నింటికి మించి రాష్ట్ర రాజధానిలో అల్లకల్లోలం కొనసాగుతోంది. గ్యాప్ లేకుండా పడుతున్న వానతో గత పదిరోజులుగా వందలాది కాలనీలు నీట మునిగాయి. మురుగు నీటిలో మునిగిన ఇళ్లలోనే చాలా మంది కాలం వెల్లదీస్తున్నారు.

ఇంటిలోకి వచ్చిన వర్షపు నీటిని ఎత్తి బయట పడబోసి.. శుభ్రం చేసుకునే లోపే మరోసారి వర్షం వచ్చి.. ముంచేస్తోంది. దీంతో ఇంట్లో ఉన్న బియ్యం, పప్పులు కూడా తడిసిపోయి అన్నమో రామచంద్రా అని ఆందోళన పడుతున్నారు ప్రజలు.

అయితే.. రాష్ట్ర రాజధానిలో, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కు కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే ఇదంతా జరుగుతోంది. కానీ.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు మాత్రం వీరి ఆర్తనాదాలు వినిపించడం లేదు. వారి కష్టాలు పట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇంటి పెద్ద వెళ్లి పరామర్శిస్తే... ఆ రిలీఫ్ మరోలా ఉంటుంది. కానీ రాష్ట్రానికి పెద్ద లాంటి ముఖ్యమంత్రి మాత్రం ప్రగతి భవన్ గడప దాటడం లేదు. వర్షాలపై రివ్యూ అంటూ రెండు రోజుల క్రితం ఓ ఫొటో, కాసింత స్క్రిప్ట్ బయటకు వదిలారు. అంతకు మించి సీఎం ఏం చేస్తున్నారో ఎవరికి తెలియడం లేదు.

సీఎం కుమారుడు, రాష్ట్రమంత్రి కేటీఆర్.. సిటీలోని కొన్నిప్రాంతాల్లో పర్యటించారు. అయితే.. ఆయన పర్యటనకు వస్తున్నారని తెలియగానే.. సిటీలోని డిజాస్టర్ రెస్పాన్స్ టీములన్నీ ఆ ఏరియాలో వాలిపోతున్నాయి. రోడ్లపై నీటిని తొలగించి మంత్రిగారి కాన్వాయ్ కి రూట్ క్లియర్ చేస్తున్నాయి.

కానీ.. ప్రజల గురించి పట్టించుకున్న వారు లేరు. వారం క్రితం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేటీఆర్.. రెండు రోజులాగితే అంతా సర్దుకుంటుంది అని చెప్పారు. కానీ .. ఇప్పుడు మరో మూడు రోజులు వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటీ..? ఇప్పుడు వారిని హడావుడిగా ఖాళీ చేయించి తీసుకెళ్లి షెల్డర్ హోంలలో పెడతారు సరే. మరి వరదలు తగ్గాక వారికి నీడ ఎక్కడ..? వారి జీవనాధారం ఏంటీ..? మరోసారి ఇలాగే వరదలు వస్తే వారి పరిస్థితి ఏంటీ..? అనే ప్రశ్నలకు మాత్రం సర్కారు సమాధానం చెప్పడం లేదు.

బాధ్యతాయుతమైన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బయటకు వచ్చి.. ఓ ప్రకటన చేస్తే.. ప్రజలకు కూడా కాస్త భరోసా కల్పించినట్టుగా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి ప్రగతిభవన్ గడప దాటడం లేదు. ఈ విషయం వర్షాలు, వరదలకు తెలియదు కదా.. అందుకే పేదల గడపే కాదు.. వారి ఇళ్లను ప్రాణాలను ముంచేస్తున్నాయి.

Next Story
Share it