Top
Batukamma

WHEN CM KCR ENDS HIS SILENCE : సారూ.. ఇప్పుడన్న మాట్లాడుతరా..? లేదా..?

WHEN CM KCR ENDS HIS SILENCE : సారూ.. ఇప్పుడన్న మాట్లాడుతరా..? లేదా..?
X
Highlights

WHEN CM KCR ENDS HIS SILENCE : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీకి ముహూర్తం...

WHEN CM KCR ENDS HIS SILENCE : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీకి ముహూర్తం రెడీ అయ్యింది. ఈ నెల ఐదో తేదీన కేబినెట్ సమావేశం కాబోతోంది. కరోనా నియంత్రణ, కరోనా నేపథ్యంలో విద్యా రంగ పరిస్థితి ఏంటనేదానిపై చర్చ, అలాగే నియంత్రిత పద్ధతితో వ్యవసాయ సాగు, సెక్రటేరియట్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కేబినెట్ లో చర్చిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

అయితే.. కేబినెట్ భేటీ తర్వాత సీఎం ప్రెస్ మీట్ ఉంటుందా..? లేదా అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ ప్రెస్ మీట్ ఉండే అవకాశాలే ఎక్కువున్నాయని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైన ప్రారంభంలో కేసీఆర్ రెగ్యులర్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ తర్వాత రాష్ట్రంలో కేసులు పెరిగిపోయాయి. దీంతో సీఎం కూడా మొహం చాటేశారు. చూద్దామంటే కనిపించే పరిస్థితి లేకుండా పోయింది. మాట విందామంటే వినబడకుండా పోయింది.

ఇప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. టెస్టులు తక్కువగా చేస్తూ.. కేసుల సంఖ్యను దాస్తున్నారనే విమర్శలున్నాయి. అలాగే.. మరణాల సంఖ్య విషయంలోనూ సర్కారుపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. కావాలనే లెక్కలు దాస్తున్నారని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా చూపిస్తున్నాయి. అయినా ఆరోగ్యమంత్రి స్పందిస్తున్నారు తప్ప.. ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు.

ప్రైవేటు హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడిపై హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అయినా చర్యలు శూన్యం. హాస్పిటళ్ల దోపిడి నడుస్తూనే ఉంది. సర్కారు మాత్రం నోటీసులిచ్చామని చెప్పి చేతులు దులుపుకుంటోంది. ముఖ్యమంత్రికి దగ్గరి వ్యక్తుల హాస్పిటల్స్ కావడం వల్లే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఓ వైపు కరోనాతో రాష్ట్రం అల్లాడుతోంటే సెక్రటేరియట్ కూల్చేశారు. రెండు వారాలు ఫాంహౌస్ లో మకాం పెట్టి సెక్రటేరియట్ కూల్చివేతకు ముహూర్తం పెట్టారు కేసీఆర్. కనీసం కూల్చివేతను కవర్ చేసేందుకు మీడియాకు కూడా అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు విధించి మరో సంచలనానికి తెరతీశారు.

ఈ లోగా ఏపీ ప్రాజెక్టుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కృష్ణాబోర్డు ఎన్నిసార్లు చెప్పినా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆగడం లేదు. ప్రాజెక్టులపై ముందుకెళ్తోంది. దీనిపై ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశామని ప్రెస్ నోట్ లు వస్తున్నాయి తప్ప.. ఇరిగేషన్ శాఖను తన దగ్గరే పెట్టుకున్న కేసీఆర్ నుంచి చడీ చప్పుడు లేదు.

ఇలా.. కుప్పలు తెప్పలుగా ఇప్పుడు సమస్యలున్నాయి. దీనిపై ఇన్ని రోజులుగా సీఎం మాట్లాడకపోవడంపై ప్రజల్లోనూ తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోంది. మరి ఈ సారైన కేబినెట్ మీటింగ్ తర్వా మాట్లాడి ఏమైనా క్లారిటీ ఇస్తారో.. లేకపోతే మళ్లీ మొహం చాటేస్తారో చూడాలి.

Next Story
Share it