Top
Batukamma

First Menstruation Experience : ఒక అమ్మాయి.. తొలి పీరియడ్స్  అనుభవం!

First Menstruation Experience : ఒక అమ్మాయి.. తొలి పీరియడ్స్  అనుభవం!
X
Highlights

First Menstruation Experience: (పాతికేళ్ల అబ్బాయినైన నేను ఓ అమ్మాయి తొలి పీరియడ్స్ అనుభవం గురించి...

First Menstruation Experience: (పాతికేళ్ల అబ్బాయినైన నేను ఓ అమ్మాయి తొలి పీరియడ్స్ అనుభవం గురించి రాస్తున్నాను. 'ఛీఛీ', 'అమ్మో', 'సిగ్గు లేకుండా ఏమిటి?'.. లాంటివి అనాలనుకునేవారు ఇక్కడే అవి అనేసుకుని పక్కకు పొమ్మని విన్నపం. నేను తప్పకుండా రాస్తాను. రాయాల్సిన అవసరం ఉంది)

'మమ్మీ! ఇక్కడ చూడు. రక్తం'

'ఏం భయం లేదులే! రా ఇలా.. బ్రాతుంలోకి పద. స్నానం చేద్దువు'

'ఎందుకిలా మమ్మీ?'

'నీకోమే! నీ ఆరోగ్యం బాగుంటుందని. ప్రతి నెలా ఇలాగ జరగుతుంది. కొంచెం నొప్పిగా ఉంటుంది'

'ప్రతినెలానా?'

'అవును! ఏం కాదు. మరీ నొప్పి ఎక్కువగా ఉంటే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఇదంతా నీ హెల్త్ కోసమే కదా'

'సరే అయితే!'

'ఒకటి చెప్పు! నీకు స్కూల్‌కి వెళ్లడం ఇష్టమా? ఇంట్లో ఉండటం ఇష్టమా?'

'స్కూల్‌కి వెళ్లడమే. ఇక్కడుంటే ఏదో పని చెప్తునే ఉంటారు నువ్వు, నానమ్మ. మర్చిపోయా! రేపట్నుంచి యూనిట్ టెస్టులు ఉన్నాయి. చదువుకోవాలి'

'స్నానం అయిపోయిందా! సరే.. వెళ్లి దేవుడి దగ్గర దీపం పెట్టి ఎగ్జామ్స్‌లో మార్కులు రావాలని కోరుకో.'

* * *

'అదేంటే! పిల్లని మూలన కూర్చోబెట్టకుండా అలా అటూఇటూ తిప్పుతున్నావ్. ఆ పుస్తకాలు ముట్టుకోనిచ్చావ్ ఎందుకుని? మైల కాదా?'

'రేపు ఎగ్జామ్స్ అంట!'

'అంటే స్కుల్‌కి పంపుతావా? ఇదేం కర్మే? దాన్ని కూర్చోబెట్టి కార్యక్రమాలు చేయొద్దా? చుట్టుప్రక్కల వాళ్లని పిలవద్దా?'

'అదంతా ఎందుకు? ఎవరికి లాభం? దాన్నడిగాను స్కూల్‌కి వెళ్తావా? ఇంట్లో ఉంటావా అని.. స్కూల్‌కి వెళ్తాను అంది. ఇళ్లంతా తిరిగే అలవాటు దానికి. మూలన కూర్చోబెడితే ఉంటుందా? మన ఇంట్లోనే దాన్ని పరాయిదానిలా మూలన పెట్టడం ఎందుకు? కావాలంటే చివరిరోజు అందర్నీ పిలిచి ఫంక్షన్ చేద్దాం'

* * *

దాదాపు 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. అప్పుటి ఆ అమ్మాయికి ఇప్పుడు పాతికేళ్ళు. తనకు మొదటి పీరియడ్స్ వచ్చినప్పుడు జరిగిన విషయాలవి. చాలా మంది చేసినట్టు వాళ్లమ్మ తనను మూలన కూర్చోబెట్టి, ఏ వస్తువూ తాకనివ్వకుండా, ఉప్పు కారాలు తిననివ్వకుండా ఉంచలేదు. రోజూ స్నానం చేసి, దేవుడికి దండం పెట్టుకొని స్కూల్‌కి వెళ్లమనేది. ఇంట్లో పెద్దవాళ్లు నానా యాగీ చేసినా పెద్దగా పట్టించుకోలేదు.

పీరియడ్స్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని ఫీలయ్యే పరిస్థితి ఎక్కడ ఉందో, అక్కడే దాన్నొక వేడుకలా చేసే సంస్కృతి ఉంది. అయితే అవన్నీ ఆడంబరాలయ్యాయే కానీ, అర్థవంతమైన చర్చకు దారి చూపలేదు. అసలు ఆడపిల్లను సొంత ఇంట్లో మూలకు కూర్చోబెట్టడం, చప్పిడి తిండి పెట్టడం ఏంటి దరిద్రంగా? అంటే నువ్వు కట్టడిలో ఉండాల్సిన మనిషివి అని చెప్పడమేగా! అమ్భానాన్నలే ఇలా ఉంటే వచ్చే మొగుడు, అత్తామామలు ఇంకెలా గౌరవిస్తారు?

ఇంకోటి.. 13 ఏళ్ల పిల్లకు ఈ వేడుకల పేరు మీద అరకిలో బంగారం, అరవై పట్టుచీరలు, మేకప్ సామాను.. కొనిచ్చి ఆ రకమైన యాంత్రిక జీవితానికి అలవాటు చేస్తున్నాం. ఆడపిల్ల చదువు కోసం ఖర్చుచేయని తల్లిదండ్రులు ఈ వేడుకల కోసం అప్పులైనా చేస్తారు. ఎందుకంటే సంప్రదాయం అన్న భయం. సమాజంలో ఏమంటారో అనే భావన.

సరే.. ఫంక్షన్ అయిపోయాక ఆ పాట స్కూల్‌కి వెళ్లిన రోజు నరకమే! మగపిల్లల చూపులు, తోటి వాళ్ల ప్రశ్నలు, ఇబ్బందిపెట్టే మాటలు.. అన్నీ భరించాలి. Girl Child School Dropoutకి ఈ అవస్థ ఒక కారణమని మీకు చెప్తే నమ్మరేమో కానీ, నేను కొందరి అనుభవాలు విన్నాక షాక్ తిన్నాను. ఇదంతా ఎందువల్ల? పీరియడ్స్ రావడం అంటే ఏదో కాకూడని పని చేసిన పద్ధతిలో ఆడపిల్లల్ని ప్రత్యేకంగా చూడడం వల్లే. అదొక ఆరోగ్య ప్రక్రియ అని చెప్పే తల్లిదండ్రులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నారు.

నాకు అర్థం కానిదేమిటంటే.. చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన డాక్టర్లు, లాయర్లు, టీచర్లు కూడా తమ ఆడపిల్లలకు తొలి పీరియడ్స్ సమయంలో ఇంకా ఆ పాతకాలపు సంప్రదాయం పాటిస్తూ బయటకు పోనివ్వకుండా, మూలన కూర్చోబెట్టి, ఉప్పూ‌ కారం లేకుండా తిండి పెట్టి, ఫంక్షన్లో బొమ్మలా నిలబెట్టి ఆనందపడుతున్నారు. ఇదంతా సంప్రదాయం పేరిట జరుగుతున్న ఘోరం. అన్నీ సంప్రదాయాలు పాటిస్తూ ఉన్నారా అంటే అదీ లేదు. దేని దారి దానిదే! ఎందుకు?

#Iamnotjustmybreastandvagina

(థ్యాంక్యూ దీప్తి. ఇలాంటి ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ఈ విషయాల్ని బయటకు తెచ్చే అవకాశం ఇచ్చారు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ ఈ అంశాల గురించి మరింతగా రాస్తేనే సమాజంలో ఉన్న Psychological Taboo పోతుంది.

Sai vamshi

Next Story
Share it